దస్ కా దమ్
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో 10 పతకాలు
కోబె (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. జావెలిన్ త్రో విభాగంలో పారాలింపిక్స్ చాంపియన్ సుమిత్ అంటిల్ స్వర్ణం కైవసం చేసుకోగా.. హై జంప్‌లో తంగవేలు మరియప్పన్, క్లబ్ త్రోలో ఏక్తా భ్యాన్‌లు పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. దీంతో పట్టికలో భారత్ 10 పతకాల (4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు)తో మూడో స్థానానికి దూసుకెళ్లింది. సుమిత్ అంటిల్ మంగళవారం జరిగిన ఎఫ్ 64 విభాగంలో జావెలిన్‌ను 69.50 మీటర్ల దూరం విసిరి పసిడి సొంతం చేసుకున్నాడు. మన దేశానికే చెందిన సందీప్ (60.41 మీటర్లు) కాంస్యంతో మెరిశాడు. ఇక టీ63 హై జంప్ విభాగంలో పారా అథ్లెట్ తంగవేలు మరియప్పన్ 1.88 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇక మహిళల ఎఫ్ 51 క్లబ్ త్రో పోటీలో ఏక్తా భ్యాన్ పసిడి సొంతం చేసుకుంది. ఏక్తా వుడెన్ క్లబ్‌ను 20.12 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్ త్రోతో స్వర్ణం చేజెక్కించుకోగా.. మరో భారత అథ్లెట్ కాశిష్ లక్రా రజతం దక్కించుకుంది.






