12 July, 2026 | 4:24 PM

Breaking News

మునిగిన ఢిల్లీ

29-06-2024 12:49 AM

3 గంటల పాటు కుండపోత వర్షం

జనజీవనం అతలాకుతలం

88 ఏళ్ల రికార్డు బద్దలు.. 228 మిల్లీమీటర్ల వర్షం

ఎటు చూసినా జలసంద్రమే

కూలిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పైకప్పు

ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

ప్రజాప్రతినిధులకూ తప్పని తిప్పలు

ఎయిర్‌పోర్ట్ ఘటనపై రాజకీయ రగడ

న్యూఢిల్లీ జూన్ 28: నిన్న మొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలు వరుణుడి దెబ్బతో అతలాకుతలం అయ్యారు. 24 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి దాదాపు 88 సంవత్సరాల రికార్డు కనుమరుగయింది. అప్పుడె ప్పుడో 1936లో కురిసిన వర్షపాతం రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గురువారం మొదలైన వర్షం శుక్రవారం వరకు ఏకధాటిగా కురిసింది. 24 గంటల్లో 235.5 మి.మీ మేర వర్షపాతం నమోదయింది.

దీంతో నగరం మొత్తం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్ల మీదకు వరదనీరు చేరడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా కురిసిన భారీ వర్షానికి నగర పరిసరాలు మొత్తం దెబ్బతిన్నాయి. చాలా మంది మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షాలకు విమానాశ్రయ టెర్మినల్ కూడా కూలిపోయింది. 

యంత్రాంగం ఘోర వైఫల్యం

వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం అయ్యామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ జూన్ 18నే ప్రకటించారు. అధికారుల అంచనాలు మొత్తం బెడిసికొట్టాయి. అనేక కూడళ్లలో రెండు అడుగుల మేర వరదనీరు వచ్చి చేరడంతో.. ఢిల్లీ వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక కుండపోతగా కురిసిన వర్షానికి ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద పార్క్ చేసిన కార్లు వర్షపు నీటిలో పడవల్లా కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు నానా అవస్థలు పడ్డారు. 

మూడు గంటల వ్యవధిలోనే...

వరుణుడు ఢిల్లీపై విరుచుకుపడిన విధా నం చూసి అంతా షాకయ్యారు. ఉదయం 2.30 నుంచి 5.30 మధ్య కేవలం మూడు గంటల వ్యవధిలోనే 150 మి.మీ వర్షం కురిసింది. ఈ సంవత్సరం ఇంత తక్కువ సమ యంలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. 

ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు.. 

కుండపోత వర్షానికి నగరంలోని లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మధుర రోడ్, తీన్‌మూర్తిమార్గ్, మూల్‌చంద్, మింట్‌రోడ్, ఆనంద్ విహార్ ఏరియా, మందవలీ, ప్రగతి మైదాన్, మధు విహార్, మోతీ బాగ్, ఐటీవో ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఢిల్లీ హైవేతో పాటు అనేక రోడ్ల మీద ట్రాఫిక్‌ను మళ్లించారు. 

వరదనీటిలో ప్రయాణీకుల బస్సు.. 

ఆజాద్ మార్కెట్ అండర్‌పాస్ ఏరియాలో బస్సు వరదనీటిలో చిక్కుకుపో యింది. చాలా చోట్ల అండర్ పాస్‌ల్లో వాహనాలు చిక్కుకుపోయి కనిపించాయి. వర్షం దెబ్బకు ఢిల్లీ మెట్రో కూడా ప్రభావితమైంది. యశ్‌భూమి ద్వారకా సెక్టార్ మెట్రో స్టేషన్‌లోని ఎంట్రీ/ఎగ్జిట్ ద్వారాలు మూసుకుపోయాయి. ఢిల్లీ ఏయిరోసిటీ మెట్రో స్టేషన్ నుంచి టెర్మినల్ ఐజీఐ విమానాశ్రయానికి షటిల్ సర్వీసును రద్దు చేశారు. 

ఆప్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా.. 

ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భారీ నష్టం జరిగిందని బీజేపీ నేత రవీందర్‌సింగ్ ఆరోపించారు. పడవతో నిరసనను వ్యక్తం చేశా రు. అన్ని మురుగుకాలువలు పొంగిపొర్లుతున్నాయని వర్షాకాలం ఆరంభమైనా ఇప్పటి వరకూ శుభ్రం చేయలేదన్నారు. నీరు నిలవడానికి ఇదే కారణమన్నారు. కానీ గతేడాదితో పోలిస్తే పరిస్థితులు మెరుగుపడ్డాయని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అన్నారు. ఈ వరద పరిస్థితులపై ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర మీటింగ్ నిర్వహించింది. శుక్రవారం ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఈ మీటింగ్ జరిగింది. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఏర్పడ్డ వరద పరిస్థితులను గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

మంత్రి ఇంటి చుట్టూ వాటర్

ఢిల్లీ మంత్రి అతిశీ ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో నీటి కొరత ఉందని ఇటీవలే మంత్రి అతిశీ నిరాహార దీక్షకు కూడా దిగారు. 

రెండు, మూడు రోజుల వరకు ఇవే పరిస్థితులు : ఐఎండీ

ఢిల్లీలో ఇంకా రెండు మూడు రోజుల వరకు ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

ఢిల్లీలో భారీ వర్షాలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మొదటి టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఆరుగురు గాయపడ్డారు. ప్రపంచంలో ఉన్న అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఇది ఒకటి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాలు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆయన విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత షెడ్యూల్ చేసిన విమానాలు 2,3 టర్మినల్స్ నుంచి నడుస్తాయని మంత్రి తెలిపారు.

ప్రధాని మోదీ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. టర్మినల్ కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు, అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. మొదటి టర్మినల్ నుంచి కేవలం దేశీయ మార్గాల్లో మాత్రమే విమానాలు నడుస్తున్నాయని తెలిపారు. ఇండిగో, స్పైస్ జెట్ తదితర దేశీయ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం రద్దున ప్రయాణీకులందరికీ పూర్తి డబ్బును వాపసు చేస్తామన్నారు. 

మార్చిలో ఓపెనింగ్... అప్పుడే

టర్మినల్ కూలిన ఘటనపై అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి.  దీన్ని మార్చిలోనే మోదీ ప్రారంభించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలను రామ్మోహన్‌నాయుడు కొట్టిపారేశారు. కూలిన బిల్డింగ్ 2009 నాటిదని, ప్రధాని ప్రారంభించిన బిల్డింగ్ వేరే పక్కన ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.