16 July, 2026 | 1:04 PM

సూపర్ రికవరీ

20-04-2024 12:20 AM

భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన సూచీలు

కనిష్ఠంనుంచి 1,400 పాయింట్లు కోలుకున్న సెన్సెక్స్

ముంబై, ఏప్రిల్  19: వరుస పతనాల్ని చవిచూస్తున్న స్టాక్ మార్కెట్  ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు జరిపిందన్న వార్తలతో శుక్రవారం ప్రపంచ ట్రెండ్‌కు  అనుగుణంగా కుప్పకూలిన తర్వాత కనిష్ఠస్థాయి నుంచి నాటకీయంగా కోలుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో క్రితం రోజుతో పోలిస్తే 700 పాయింట్లు క్షీణించి 71,816 పాయింట్లకు పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్ నుంచి జోరుగా రికవరీ అయ్యింది. కనిష్ఠస్థాయి నుంచి దాదాపు 1,400 పాయింట్లు ర్యాలీ జరిపి 73,210 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు గత ముగింపుతో పోలిస్తే 600 పాయింట్లు లాభపడి 73,088 పాయింట్ల వద్ద నిలిచింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో తొలిదశలో ఆరు నెలల కనిష్ఠస్థాయి 21,777 పాయింట్ల వద్దకు క్షీణించిన తర్వాత 22,180 పాయింట్ల స్థాయికి 300 పాయింట్లకుపైగా పెరిగింది. చివరకు క్రితం ముగింపుకంటే 151 పాయింట్లు లాభపడి 22,147 పాయింట్ల వద్ద నిలిచింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తితలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు గల్లంతుకావడంతో  గత నాలుగు రోజులుగా సెన్సెక్స్ 2,500 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్ల చొప్పున పడిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం రికవరీ జరిగినప్పటికీ, ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,156 పాయింట్లు, నిఫ్టీ 372 పాయింట్ల చొప్పున తగ్గాయి. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలతో పాటు ప్రధాన యూరప్ మార్కెట్లు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు సైతం నష్టాలతో ముగిసాయి. 

వెలుగులో బ్యాంకింగ్ షేర్లు

తాజా మార్కెట్ రికవరీకి బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో జరిగిన కొనుగోళ్లు ప్రధాన కారణం. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫైనాన్స్ 3.1 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, భారతి ఎయిర్‌టెల్‌లు 1 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు నెస్లే, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సన్ అండ్ టూబ్రోలు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 1.02 శాతం పెరగ్గా, మెటల్ ఇండెక్స్ 0.85 శాతం, ఫైనాన్షియల్ సర్వీసుల సూచి 0.83 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.78 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.54 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్స్, యుటిలిటీస్, రియల్టీ, టెక్నాలజీ సూచీలు తగ్గాయి. 

దాడుల ప్రభావం తక్కువ

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నా, భారత్ సూచీలు పటిష్ఠంగా రికవరీ అయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడితో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు తక్కువన్న అంచనాలతో లార్జ్‌క్యాప్ షేర్లలో తాజా కొనుగోళ్లు జరిగాయన్నారు. అయితే గరిష్ఠ చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం రిస్క్‌లు ఉంటాయని హెచ్చరించారు.