7 May, 2026 | 5:54 AM

అమెరికాలో తహవూర్ రాణాకు ఎదురుదెబ్బ

08-03-2025 01:16 AM

 అత్యవసర స్టే పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

 భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్

న్యూయార్క్: 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాకు అమెరికా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.   గత నెల 28న భారత్‌కు అప్పగింతపై అత్యవసర స్టే కోరుతూ రాణా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా శుక్రవారం తహవూర్ పిటిషన్‌ను కొట్టేస్తూ యూఎస్ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పాకిస్థాన్ పౌరుడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తనను భారత్‌కు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని సాకు చూపించిన తహవూర్ రాణా స్టే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అమెరికా సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేయడంతో అతడికి భంగపాటు ఎదురైంది. ఇక 2008 ముంబై ఉగ్రదాడులకు ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణాకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.