మహాకుంభమేళాకు వెళ్లి.. 30 కోట్లు సంపాదించి
తల్లి బంగారం కుదువ పెట్టి పడవల కొనుగోలు
45 రోజుల్లో కోట్లకు పడగలెత్తిన పింటూ మల్లా
అసెంబ్లీలో ‘పింటూ సక్సెస్ స్టోరీ’ ప్రస్తావించిన సీఎం యోగి
లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా చాలా మంది జీవితాలను మార్చేసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ మహాక్రతువు చాలా మంది చిరు వ్యాపారుల జీవితాల్లో ధన కాంతులను విరజిమ్మింది. కుంభమేళా ద్వారా కోట్లకు పడగలెత్తిన జాబితాలో పింటూ మల్లా కూడా చేరిపోయాడు. ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ ప్రాంతానికి చెందిన పింటూ మల్లా పొట్టకూటి కోసం పడవను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో దుర్భర జీవితంతో కాలం వెళ్లదీసేవాడు. అలాంటి సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా పింటూ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇన్నాళ్లు తనకు ఏదైతే పట్టెడన్నం పెట్టిందో దానినే నమ్ముకొని కుంభమేళాలో అడుగుపెట్టిన పింటూ మల్లా 45 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలు సంపాదించి ధనవంతుడిగా మారిపోయాడు. పింటూ సక్సెస్ స్టోరీని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అసెంబ్లీలో చర్చించడంతో ప్రస్తుతం అతడి పేరు యూపీ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
తల్లి బంగారం కుదువం పెట్టి..
మహాకుంభమేళా ద్వారా తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలనుకున్న పింటూ మల్లా ఆ దిశగా అడుగులు వేశాడు. తల్లి బంగారం కుదువ పెట్టిన పింటూ 130కి పైగా పడవలను అద్దెకు తీసుకొచ్చాడు. కుంభమేళాకు వచ్చే భక్తులను పడవలో పుష్కరణి ఘాట్ వద్దకు తీసుకెళ్లేందుకు పడవలను ఏర్పాటు చేశాడు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో ఒక్కో పడవ చొప్పున రోజుకు రూ. 52 వేలు సంపాదించేవాడు. అలా 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. తనకు వచ్చిన లాభాల్లో నుంచి కొన్ని డబ్బులు తీసి తల్లి బంగారాన్ని వెనక్కి తెచ్చుకున్న పింటూ తనకున్న అప్పులన్నీ తీర్చేసినట్లు మీడియాకు వెల్లడించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మా సక్సెస్ స్టోరీని అసెంబ్లీ సాక్షిగా పంచుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ‘గంగమ్మ తల్లికి మా కుటుంబం రుణపడి ఉంది. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇక్కడే చనిపోతాం. మా జీవితాలను మార్చేసిన గంగా నదికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పింటూ మల్లా పేర్కొనడం విశేషం.






