18 May, 2026 | 5:13 PM

కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

18-05-2026 04:28 PM

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేబీఆర్ పార్క్(KBR Park) వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకు చెట్లను కోట్టేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లను కొట్టేయవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను కొట్టేయవద్దని సూచించింది. కేబీఆర్ పార్క్ పరిధిలోని సుమారు 1,300 చెట్లు నరికేస్తున్నారని న్యాయవాది వివేక్ రెడ్డి(Advocate Vivek Reddy) వెల్లడించారు. ప్రణాళిక ఏమైనా ఉందా.. చెట్లు తొలగించకుండా నిర్మించవచ్చా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రణాళిక అంటూ ఏమీ లేదని సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి తెలిపారు.

వాస్తవానికి ప్రభుత్వమే చెట్లను తొలగిస్తుందని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను నరుకుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లు నరక వద్దని అభివృద్ధి బోర్డు చెప్పిందని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనల అనంతరం ప్రతివాదులకు  సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, పీసీసీఎఫ్, మరో ఇద్దరు వ్యక్తులను పిటిషనర్ చేర్చారు. రాష్ట్రం తరుపున స్టాండింగ్  కౌన్సిల్ కు నోటీసు అందించాలని పిటిషనర్ న్యాయవాదికి ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పిటిషనర్ న్యాయవాదిని ఆదేశించింది.  కేసు తదుపరి విచారణను ధర్మాసనం జులై 27కి వాయిదా వేసింది.