28 May, 2026 | 2:50 AM

సాధారణ కాన్పులు పెంచాలి

28-05-2026 02:02 AM

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్

జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ 

జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం, మే 27, (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ క్యాంపులు అధికంగా జరిగేటట్లు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, గర్భిణీల రిజిస్టర్లు, టీకాల కార్యక్రమ అమలు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణీలకు  ఈ డి డి  క్యాలెండర్ ప్రకారం ప్రసవ తేదీలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి గర్భిణికి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. గర్భిణీలు ఐరన్, కాల్షియం మాత్రలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత నివారించవచ్చని వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలోనే సురక్షిత ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ కాన్పుల శాతాన్ని పెంచేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. తల్లి , శిశు మరణాలను తగ్గించేందుకు హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు ఉన్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకరోజు డ్రైడే పాటించాలని ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రత పాటించడం, మరుగుదొడ్లు వినియోగించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ (ఎమ్ ఎల్ హెచ్ పి), రాధిక (హెచ్ వి,) నర్సింగ్ ఆఫీసర్, సిబ్బంది, పాల్గొన్నారు.