27 May, 2026 | 2:51 AM

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

27-05-2026 01:49 AM

తలకొండపల్లి, మే 26,(విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి  డా. స్వర్ణకుమారి  మంగళవారం తలకొండపల్లి, గట్టి ఇప్పలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను. పరిశీలించారు. ఈ సందర్భంగా డీ ఎంహెచ్వో  ఆసుపత్రిలోని ఓపీ సేవలు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, మందుల నిల్వలు, పారిశుధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.

హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, రోగుల కేసు షీట్లు తనిఖీ చేసి, వైద్యులు వైద్య సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై డీ ఎంహెచ్వో అసంతృప్తి వ్యక్తం చేస్తూ  విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు వైద్య సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నానని హెచ్చరించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి నాణ్యమైన వైద్యం అందించి, సమయపాలన పాటిస్తూ, డాక్టర్లు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు.మందుల కొరత లేకుండా చూసుకోవాలి.

ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి‘ అని సిబ్బందికి సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలు,పీహెచ్ సీ లో కుక్క కాటు, పాము  కోతికాటుకు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమాలు,సీజనల్ వ్యాధుల నివారణ,ప్రభుత్వ ఆదేశానుసారం  వడదెబ్బ కు సంబంధించి కేసుల వివరాలపై ఆరా తీశారు. ఎవరైనా మృతి చెందితే చర్యలపై డా. స్వర్ణకుమారి  ప్రత్యేకంగా సమీక్షించారు.

రాబోయే వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ,మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి,గట్టి ఇప్పలపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.