దివ్యాంగులను గౌరవించాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రవీంద్రభారతిలో మరుగుజ్జుల రజతోత్సవం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం మరుగుజ్జుల 25వ రజతోత్సవం నిర్వహిం చారు. వారిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై అతిథిగా టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాజంలో దివ్యాంగుల పట్ల ఉన్న దృక్పథం మారాలని, వారిని గౌరవప్రదమైన పేరుతో పిలవాలని సూచించారు. ‘మరుగుజ్జులు‘ అనే పదం వాడటం సరైంది కాదని, వారికి ఆత్మగౌరవాన్ని ఇచ్చేలా మరో పేరు పెట్టాలని మల్లన్న కోరారు. ‘శారీరకంగా తక్కువ ఎత్తు ఉన్న వీళ్లు మరుగుజ్జులు కాదు..
వీరికి ఏమీ చేయలేని ప్రభుత్వాలు, పట్టించుకోని వ్యవస్థలే అసలైన మరుగుజ్జులు‘ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘంలోని సభ్యుల పిల్లలందరి స్కూల్ ఫీజుల బాధ్యతను తానే స్వీకరిస్తున్నట్లు మల్లన్న ప్రకటించారు. ఆ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ప్రతి ఏటా వికలాంగుల కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నాయని,
కానీ అది ఆచరణలో ఖర్చు కావడం లేదని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్టే వికలాంగులపై వివక్ష చూపేవారికి వ్యతిరేకంగా ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరారు. ఆంగ్లో ఇండియన్ల తరహాలో వీరికి ప్రత్యేక కోటాను కేటాయించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల్లో ఎంతో మంది మేధావులు, శాస్త్రవేత్తలు ఉన్నారని, సరైన అవకాశాలు లేక వారి మేధస్సు బయటకు రావడం లేదని మల్లన్న అభిప్రాయపడ్డారు.




