16-06-2025 12:00:00 AM
డొల్లతనంగా డొల్లిపోయిన
స్వాతంత్య్ర దినాలన్నీ
కన్నీటిగుండెల్ని పుండయ్యెట్టు చేసాయి
అరిగిన యముకల గూళ్ల సాక్షిగా
బీటలు వారిన పాదాల సాక్షిగా
శ్రమజీవి హదయ సంక్షోభాన్ని
ఎప్పుడూ తీరని కోర్కెలా
దోపిడి తూటాకు
గురిపెట్టి చూస్తుంది పాడుకాలం
ఏడు తరాల ఏడుపు కోసమో
ఎనిమిది గంటల హక్కుల కోసమో
నోటికందని మెతుకుల కోసమో
రాజ్యాంగాన్ని కాలరాసే
రాకాసి పీడల నీడల విముక్తి కోసమో
రక్త చరిత్ర రాసుకున్న
ఓ శ్రామికజన ధీరులారా..
శ్రమైక విప్లవ శూరులారా
ఇన్నాళ్లయినా ఇన్నేళ్లయినా...
ఇంకా ఇంకా మిమ్మల్ని
అనుసరిస్తునే వున్నాం
మీ త్యాగాల తడిలో
దేహాలకి పుటం
పెట్టుకుంటూనే వున్నాం
ఈ వెర్రితలల శల్యపరీక్షల్ని
ఈ వెనుకబాటుతనాన్ని
ప్రశ్నిస్తూనే వున్నాం
నిగూఢమైన .. అగాధమైన
ఈ దాగుడు మూతల దాష్టీకంలో
నిరంతరంగా తరం తరంగా
వివక్షా చీకటి గుహలో చిక్కి
ఇంకెంత కాలం ఇలా దుఃఖించాలో
ఇంకెంత కాలం
ఈ భ్రమవిభ్రమాల మధ్య
బలిపశువుగా మారిపోవాలో..
ఓ శ్రమను నమ్ముకున్న శ్రామికుడా..
నీ దారిద్యరేఖలపై వక్రరేఖల్ని
గీస్తున్నాడెవడో
నీ చెమట చుక్కలమీద
పెట్టుబడులను నాటుతున్నాడెవడో
నీ సస్య వ్యవసాయ క్షేత్రాన్ని
స్వాధీనం చేసుకుంటున్నాడెవడో
నిన్నూ ఓ సరుకుని చేసి
అమ్ముతున్నాడెవడో
నీ కష్టార్జిత అంకురాలపై
యంత్రపు తుమ్మెదలు
వాలుతున్నాయి చూడు
దాచుకున్న నీ సంపద తేనెను
నీకు తెల్వకుండానే ఖాళీ
చేస్తున్నాయి గమనించు
ప్రకృతి ప్రసాదించిన
సహజ వనరులన్నీ
నీపై మాయావస్త్రాన్ని కప్పి
బొక్కేస్తున్నారు
ఏ మాత్రం ఏమరుపాటు నుండకు
నీ కనీస అవసరాలైన
విద్య వైద్య ఆహారాలు
అందని ద్రాక్షల్ని చేసి
ఆడుకొంటున్నారు
ఆకాశాన నక్షత్రాలు మావే అంటూ
ఆవిష్కరిస్తున్నారు, కాస్త దృష్టి పెట్టు
నువ్వు తాగే కుండకు చిల్లు పెట్టీ
నువ్వు శ్వాసించే గుండెకు
మంట పెట్టీ
నిన్ను ఓ బికారీని చేసి
నీ విలువల వలువలూడుస్తున్నాడు వాడు
లే... జాగ్రత్త పడు,
పిడికిలి బిగించు
తూరుపు ఎరుపువై పునర్జ్వళించు
యుద్ధభేరి ప్రతిధ్వనివై ప్రతిఫలించు
శక్తాశక్త కాలంలోనూ
ఆశా నిరాశల లోలకమై ఊగిన వాడా
శ్రమజీవన పోరాటంలో
ఆయుధమైన వాడా
నీ స్వేదపు దుఃఖం అనంతం.. అమేయం
ఎరుపెక్కిన నీ కళ్ళని మేడే జండాగా ఎగరేయ్
అలుపెరగని నీ ఆశయాన్ని
ఆర్తి గీతంగా పాడేయ్!
డా.కటుకోఝ్వల రమేష్