05-10-2025 01:10:16 AM
పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ హీరోగా మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కాంబో లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావటంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కంటెంట్‌తో సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, పవన్ అభిమానులకు దీపావళికి ఈ సినిమాపై మరింత క్లారిటీ రానుందా? అంటే ఇండస్ట్రీ వర్గాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి.
ఎందుకంటే దీపావళి కానుకగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అర్థమవు తున్నా.. సరైన డేట్‌ను ఇంకా మేకర్స్ లాక్ చేయలేదు. దీపావళి సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల భోగట్టా! ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తుండగా, అయనంక బోస్ డీవోపీగా పనిచేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.