28 July, 2026 | 12:34 PM

రోజూ 50 ఫోన్ల ట్యాప్

30-05-2024 01:13 AM

17 కంప్యూటర్లు, 56 మంది సిబ్బందితో.. 1200 మంది ఫోన్లు ట్యాప్

36 మంది వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు

ఆభరణాల వ్యాపారులపై ప్రత్యేక దృష్టి

హవాలా బిజినెస్ నుంచీ భారీగా వసూలు

సర్కారు మారగానే బేగంపేట నాలాలో ఫోన్లు

మూసీ నదిలో హార్డ్ డిస్క్‌లు పారవేశాం

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం

జూన్ ౩న భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు మరిన్ని వివరాలు బయటపెట్టాడు. ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎలా నిర్వహించారన్న వివరాలను పూసగుచ్చినట్టు దర్యాప్తు అధికారులకు వివరించినట్టు తెలిసింది. ౫౬ మంది టీంను ఏర్పాటుచేసుకొని, రోజు ౪౦ నుంచి ౫౦ ఫోన్ల చొప్పున మొత్తం ౧౨౦౦ మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిపాడు.

నాటి ప్రభుత్వ పెద్దలకు అక్కరకొచ్చే పనులతోపాటు అప్పటి ఎస్‌ఐబీ డైరెక్టర్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో సొంత దందాలు కూడా చేసినట్టు తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వివరించాడు. ఈ కేసులో అరెస్టయిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్‌రావు వేర్వేరుగా ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలోని వివరాలే విస్తుగొలుపుతుండగా, ట్యాపింగ్‌లో అన్నీ తానే అయ్యి వ్యవహరించిన ప్రణీత్‌రావు.. ఈ కథనంతా వరుసక్రమంలో పూసగుచ్చినట్టు తెలిపాడని పోలీస్ వర్గాల సమాచారం.  

౩న బెయిల్ పిటిషన్ల విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులైన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలుచేసిన బెయిల్ పిటిషన్లపై వచ్చే నెల ౩వ తేదీన విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్లపై వెంటనే విచారణ జరుపాలన్న వారి అభ్యర్థనను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఓసారి వారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది.  

వ్యాపారుల నుంచి కోట్లు వసూలు 

ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో 36 మంది వివిధ రంగాల వ్యాపారులను బెదిరించి కోట్లలో డబ్బు లు వసూలు చేసినట్టు ప్రణీత్‌రావు తెలి పాడు.  ముఖ్యంగా ఆభరణాల వ్యాపా రులు, హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువరు నిర్మాణ రంగ కంపెనీల యజమానులను టార్గెట్ చేసినట్టు వెల్లడించాడు. దీంతో బాధితు లు ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచించారు. 

ప్రణీత్‌రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇదీ..

* నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో రోజూ 30-40 మంది ఫోన్లు ట్యాప్ చేశాం. అలా 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశాం.

* ట్యాపింగ్ చేసినవారిలో ప్రధానంగా విపక్షనేతలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారు.

* ఎన్నికల్ల కాంగ్రెస్ గెలువటంతో ప్రభాకర్‌రావు ఆదేశాలమేరకు ట్యాపింగ్‌ను ఆపేశాం. 

* కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఫోన్లు ట్యాప్ చేశాం. 

* ప్రతిపక్షాలకు సాయం చేస్తున్నవాళ్ల డబ్బును ఎప్పటికప్పుడు ట్యాపింగ్, ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పట్టుకున్నాం. ఆ డబ్బును ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం. 

* ఫోన్ ట్యాపింగ్ కోసం 17 కంప్యూటర్లు వాడాం. 

* రెండు లాగ్‌రూముల్లో 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ చేశాం. అందుకోసం 8సెల్‌ఫోన్లను ఉపయోగించాం. అధికారికంగా మూడు ఫోన్లను కేటాయించగా.. అనధికారికంగా మూడు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశాం. 

* వీవోఐపీ ద్వారానే ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్లం. 

* ప్రభాకర్‌రావు రాజీనామా చేసేముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని ఆదేశించారు.

* దాంతో రికార్డులను ధ్వంసం చేసి వాటి స్థానంలో 50 కొత్త హార్డ్ డిస్కులను తీసుకొచ్చి అమర్చాం. ధ్వంసం చేసిన 17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. 

* 17 హార్డ్‌డిస్క్‌లను కట్టర్‌తో కట్‌చేసి ముక్కలు చేశాం. వాటిలో పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్, ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కాల్చేశాం.

* ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేశాం.

*పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశాం.

* ఫార్మాట్ చేసిన సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లన్నింటినీ బేగంపేట నాలాలో పడేశాం. 

* మేం చేస్తున్నది నేరమని, విలువైన సమాచారం పోతుందని తెలుసు. కానీ మమ్మల్ని మేం కాపాడుకోవడానికే ఇదంతా చేశాం.

* ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశాం. 

* అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి 7:30 గంటల నుంచి 8:15 గంటల మధ్య ఫోన్ ట్యాపింగ్‌కు ఉపయోగించిన అన్ని ఆధారాలను చెరిపివేశాం.

* కన్వర్జెన్స్ ఇన్వోవేషన్ ల్యాబ్స్‌కు చెందిన శ్రీనివాస్, అనంత్‌ను ఎస్‌ఐబీ ఆఫీస్‌కు పిలిచి వారు మాకు ఇచ్చిన సర్వర్లు, హార్డ్ డిస్కులను తిరిగిచ్చేశాం.

* ఈ పనులు చేసేందుకు ఆర్‌ఎస్‌ఐ అనిల్‌కుమార్ సీసీ కెమెరాలను ఆఫ్ చేశారు.

* తమ ఆదేశాలు పాటించేందుకు అనిల్‌కుమార్ మొదట నిరాకరించారు. చివరికి అతన్ని భయపెట్టి సీసీ కెమెరాలను ఆఫ్ చేయించాం.