31 August, 2026 | 10:48 PM

తగ్గిన సిమెంట్ ధరలు

09-06-2024 02:30 AM

బస్తా ధర సగటున 8 శాతం మేర తగ్గుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో సిమెంట్ ధరలు తగ్గాయి. ఇన్‌పుట్ వ్యయాలు తగ్గడంతో వార్షిక ప్రాతిపదికన సిమెంట్ బస్తా ధర సుమారు 8 శాతం తగ్గింది. దీంతో రా్రష్ట్రంలో సిమెంట్ బస్తా ధర సగటున సుమారు రూ.340కి చేరింది. గత రెండేళ్లలో సిమెంట్ ధరలు వార్షిక ప్రాతిపదికన కాస్త తగ్గాయి.

2023 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ బస్తా ధర సగటున రూ.375 ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో అది రూ.365కి తగ్గింది. ఇన్‌పుట్ వ్యయాలు తగ్గడమే సిమెంట్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని సిమెంట్ పరిశ్రమలు పేర్కొంటున్నాయి. 2024 మే నెలలో బొగ్గు ధరలు 45 శాతం మేర తగ్గాయి. అలాగే పెట్ కోక్ ధరలు కూడా 10 శాతం తగ్గాయి. డీజిల్ ధరలు కూడా 2 శాతం మేర తగ్గి లీటరు రూ.88కి వచ్చింది.

అలాగే 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో బొగ్గు 50 శాతం మేర, పెట్ కోక్ 16 శాతం, డీజిల్ 2 శాతం మేర ధరలు తగ్గడంతో ఇన్‌పుట్ వ్యయాలు ఆ మేరకు తగ్గాయి. ఈ క్రమంలోనే సిమెంట్ ధరలు తగ్గడంతో విక్రయం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం సిమెంట్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని డీలర్లు పేర్కొంటున్నారు. మొత్తంగా 2024 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు 426 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఇలాగే కొనసాగితే 8 నుంచి 9 శాతం సిమెంట్ అమ్మకాలు మరింత వృద్ధి నమోదు చేస్తాయని డీలర్లు అంచనా వేస్తున్నారు.