టీడీపీ ప్రభంజనం!
ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ
135 సీట్లతో విజయ దుందుభి
11 సీట్లకే పరిమితమైన వెస్సార్‌సీపీ
21 సీట్లలో ప్రభంజనం సృష్టించిన జనసేన
8 సీట్లలో గెలుపొందిన బీజేపీ
ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని వైసీపీ
అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్న లోకేశ్, పవన్
పిఠాపురం నుంచి జనసేనాని పవన్ గెలుపు
మంగళగిరి నుంచి నారా లోకేశ్ రికార్డు గెలుపు
30 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ పాగా
అమరావతి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ విజయం సాధించింది. అధికార వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం తప్పలేదు. ఏపీలో 175 సీట్లున్న అసెంబ్లీలో టీడీపీ ఒంటరిగా ఏకం గా 136 సీట్లు గెలుచుకుంది. కూటమిలో భాగమైన బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో అంటే 21 సీట్లలో విజయ ఢంకా మోగించింది. ఇక అధికార వైఎస్సార్‌సీపీ మరీ ఘోరంగా 11 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ ఈ ఎన్నికల్లో మరీ ఘోరంగా 11 సీట్లకు పడిపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది.
ఏపీలో ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 సీట్లు రావాలి. కానీ 11 సీట్ల దగ్గరే ఆగిపోవడంతో వైఎస్సార్‌సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడం గమనార్హం. జగన్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులు కూడా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను ఏకంగా 16 సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందగా, అధికార వైఎస్సార్‌సీపీ మాత్రం నాలుగు సీట్లకు పరిమితమైంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్కు మేర సీట్లు రాకపోవడంతో 16 సీట్లు సాధించడంతో టీడీపీ కేంద్రంలో మరోసారి చక్రం తిప్పే అవకాశం దక్కించుకుంది.
తొలిసారి గెలిచిన నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవాలన్నట్టుగా ఈసారి మంగళగిరి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు లోకేశ్ తన విజయంతో సమాధానం చెప్పారు. 39 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ ఇక్కడ గెలుపొందడం గమనార్హం. 1985లో టీడీపీ నుంచి కోటేశ్వర్‌రావు విజయం సాధించారు. ఆయన తర్వాత టీడీపీ ఇప్పటివరకు ఆస్థానంలో గెలవలేదు.
చంద్రబాబు నివాసంలో సంబురాలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల ను కైవసం చేసుకున్న టీడీపీ కూటమి విజయోత్సవాల్లో మునిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని నివాసంలో సంబరాలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తన మనవడికి తిని పించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఈ సారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బాబు నివాసంలో ఉత్సాహం రెట్టింపైంది. భువనేశ్వరీ, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో చంద్రబాబు సంతోషంలో మునిగారు.
పిఠాపురంలో పవన్ విక్టరీ
పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 69,169 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ గెలుపొందారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి పవన్ కల్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
బాలకృష్ణ హ్యాట్రిక్..
హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణకు కంచుకోటగా మారింది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019, 2024 వరుస ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజేతగా నిలిచారు. ఈ మూడుసార్లు ఆయన వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థిపైనే గెలుపొందడం గమనార్హం. అంతకుముందు 2004 నుంచి టీడీపీ ఈ స్థానంలో విజయం సాధిస్తూ వస్తోంది.
ఫలితాలు ఆశ్యర్యాన్ని కలిగించాయి: వైఎస్ జగన్
అసెంబ్లీ ఫలితాలు తనకు ఆశ్యర్యాన్ని కలిగించాయని ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చామని, పేదలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోను ఎంతో పవిత్రంగా భావించి ప్రజలకు ఎంతో మంచి చేసేందుకు కృషి చేశామని జగన్ అన్నారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించామని, అయినా వారందరి ప్రేమ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రతిపక్షంలో ఉండటం, పోరాడటం కొత్త కాదని చెప్పారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు. విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్ జగన్ రాజీనామా
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో.. తన మంత్రివర్గం రద్దును కోరుతూ గవర్నర్ అబ్దుల్ నసీర్‌కు మంగళవారం రాత్రి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. లోపాలను సరిదిద్దుకుని ప్రజల పక్షాన నిలబడతామని ఆయన తెలిపారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్రం లో ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి నేతలతో బీజేపీ చర్చించనుంది.
జూన్ 9న ప్రమాణస్వీకారం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన చంద్రబాబు నాయు డు.. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకా రం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది.






