30 June, 2026 | 9:58 AM

వేట షురూ

06-06-2024 12:29 AM

న్యూయార్క్: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. గ్రూప్ భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలిసారి ఐసీసీ మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో.. రోహిత్ సేన తమ సత్తాచాటింది. అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులను దిల్‌ఖుష్ చేస్తూ అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో సత్తాచాటింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.

గెరెత్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. భారత పేసర్ల ధాటికి ఐరిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో గెరెత్ తర్వాత రెండో అత్యధిక స్కోరు ఎక్స్‌ట్రాలే (15) కావడం విశేషం. జోష్ లిటిల్ (14), కాంఫర్ (12), టకర్ (10) ఓ మాదిరిగా ఆడారు. మన బౌలర్లలో సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో అదుర్స్ అనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషబ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ముందే ఊహించినట్లుగా.. యశస్వి జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ ఓపెనర్ అవతారమెత్తాడు. ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఓపెనర్‌గా పరుగుల వరద పారించిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో అదే జోరు కనబర్చలేకపోయాడు.

క్రీజులో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన విరాట్.. తానెదుర్కొన్న 5 బంతికి డీప్ థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే లక్ష్యం పెద్దది కాకపోవడంతో టీమిండియాకు ఇబ్బంది లేకుండా పోయింది. రోహిత్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతడికి పంత్ చక్కటి సహకారం అందించాడు. ఫిఫ్టీ మార్క్ అందుకున్న తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. పంత్ మిగిలిన లాంఛనాన్ని ముగించాడు. సూర్యకుమార్ యాదవ్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ చెరో వికెట్ పడగొట్టారు. 

దాయాదితో జాగ్రత్తా!

ప్రపంచ చాంపియన్ ట్యాగ్ కోసం పరితపిస్తున్న టీమిండియా.. టీ20 వరల్డ్‌కప్‌లో శుభారంభం చేసింది. మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్, అమెరికా పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలిస్తాయని ముందే ఊహించిన మేనేజ్‌మెంట్ అందుకు తగ్గట్లే నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లను ఎంపిక చేసింది. అందుకు తగ్గట్లే ఐర్లాండ్‌తో తొలి పోరులో మన బౌలింగ్ యూనిట్ సమష్టిగా కదం తొక్కింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ పిచ్‌పై పచ్చిక గమనించి స్ట్రయిక్ బౌలర్ బుమ్రాను కాదని.. అర్ష్‌దీప్‌కు బంతి అందించగా.. ఈ ప్రయోగం ఫలించింది.

అతడు రెండో ఓవర్‌లో ఐర్లాండ్ ఓపెనర్లను ఔట్ చేయగా.. ఆ తర్వాత కూడా మన బౌలర్లు జోరు కనబర్చారు. ఆనక స్వల్ప లక్ష్యఛేదనలో విరాట్ త్వరగానే వెనుదిరిగినా రోహిత్ ధాటిగా ఆడి మిగిలిన పనిపూర్తిచేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బౌలింగ్‌కు ఈ రేంజ్‌లో సహకరిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆందోళన రేకెత్తిస్తోంది. షాహీన్ అఫ్రిది, హరీస్ రవుఫ్, మహమ్మద్ అమీర్ వంటి పాకిస్థాన్ సూపర్ ఫాస్ట్ బౌలర్లను ఈ పిచ్‌పై ఎదుర్కోవడం కత్తి మీద సామే అని ఈ రోజు అర్ష్ దీప్ స్పెల్ నిరూపించింది.

జట్టులో ఉన్న ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతుండటంతో.. ఒకవేళ రోహిత్, కోహ్లీ త్వరగా ఔటైతే పరిస్థితి ఏంటి అనేది ఇబ్బందికరంగా మారింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘనమైన రికార్డు ఉన్న టీమిండియా.. వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో కలిసి కేవలం ఒకే ఒక్కసారి (2021 టీ20 వరల్డ్‌కప్‌లో) దాయాది చేతిలో ఓడింది. ఆ మ్యాచ్‌లో బంతితో నిప్పులు చెరిగిన షాహీన్ అఫ్రిదిని ఈసారి మనవాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి!