18 June, 2026 | 3:35 AM

భారత్‌దే సిరీస్

18-06-2026 02:27 AM

రెండో వన్డేలోనూ ఆప్గనిస్థాన్ చిత్తు

సెంచరీలతో కదంతొక్కిన గిల్, ఇషాన్

బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శన

170 రన్స్‌తో గెలిచిన టీమిండియా

సొంతగడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగిన వేళ భారీస్కోరు సాధించిన భారత్ తర్వాత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో  ఆఫ్గన్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. 

ఆఫ్గనిస్థాన్, జూన్ 17: ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆప్గనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే జైస్వాల్ (4) వికెట్ కోల్పోయింది. తర్వాత రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్ద రూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆప్గన్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ 39 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్‌లో 14 వేలు పరుగుల మైలురాయి అందుకున్నాడు. రోహి త్ ఔటైన తర్వాత గిల్‌కు ఇషాన్ కిష న్ జత కలిశాడు. వీరిద్దరూ ఆప్గన్ బౌలర్లను ఆటాడుకున్నారు. కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు.

ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 79 బంతు ల్లోనే 14 ఫోర్లు. 7 సిక్సర్లతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్, శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులు జోడించారు.  ఆప్గనిస్థాన్ పై భారత్‌కు 400 ప్లస్ స్కోరు చేయడం ఇదే తొలిసారి. అలాగే వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 400 ప్లస్ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఇప్పటి వరకూ రెండు జట్లు 8 సార్లు 400కు పైగా స్కోర్లు చేసాయి. భారత ఇన్నింగ్స్ గమనిస్తే 11 నుంచి 40 ఓవర్ల మధ్యే అసలైన విధ్వంసం జరిగింది.

ఈ 30 ఓవర్ల వ్యవధిలోనే భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఏకంగా 260 పరుగులు రాబట్టింది. గిల్, కిషన్ జోడీ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఈ ఇద్దరు సెంచరీ హీరోలు ఔటయ్యాక భారత రన్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఆఖరి 10 ఓవర్లలో ఆఫ్ఘన్ బౌలర్లు పుంజుకోవడంతో టీమిండి యా వరుసగా వికెట్లు కోల్పోయింది. 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది.

అయినప్పటికీ, వన్డేల్లో భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోర్ల బితాలో ఇది చోటు సంపాదించుకుంది. తర్వాత ఛేజింగ్‌లో కాసేపు దూకుడుగా ఆడిన ఆప్గనిస్థాన్‌ను భారత బౌల ర్లు కట్టడి చేశారు. 232 పరుగులకే వాళ్ల కథ ముగించారు. దీంతో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 , ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసారు. సిరీస్‌లో చివరి వన్డే చెన్నైలో శనివారం జరుగుతుంది.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 402 ( గిల్ 154, ఇషాన్ కిషన్ 125, రోహిత్ శర్మ 48 ; ఖరోటి 4/76, రషీద్ ఖాన్ 3/48 )

ఆప్గనిస్థాన్ ఇన్నింగ్స్ :  232 ( రమహత్ షా 79, సెదిఖుల్లా 42, గుర్బాజ్ 41 ; అర్షదీప్ 3/45,గుర్నూర్ బ్రార్ 3/60 )