2 August, 2026 | 9:06 PM

కూల్చేయండి

24-08-2024 01:07 AM

భయపెడితే సత్తా చూపిస్తాం: కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వం విపక్ష నేతలను టార్గెట్ చేసినట్టుగా కాకుండా.. హైడ్రా ద్వారా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చివేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలపై కక్షగట్టి కూల్చివేతలు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. డీజీపీ ఆఫీసు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ లాంటి ఎంతో మంది నాయకుల నివా సాలు బఫర్‌జోన్‌లో ఉన్నాయని వా రి భవ నాలను కూల్చేసిన తరు వాత సామా న్యులు నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలన్నారు.  అక్రమా ర్కుల పట్ల ఒకే విధంగా నిబంధనలు పాటించాలని పేర్కొ న్నారు. 

అక్రమార్కులను వదిలిపెట్టొద్దు X కొత్త టేపు తీసుకొచ్చి కొలుసుకోవచ్చు 

  1. హైడ్రా కమిషనర్‌కు ఆదేశిస్తున్నా.. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉంటే కూల్చేయండి 
  2. కేటీఆర్, హరీశ్‌రావు ఎప్పుడొస్తారో తేదీ చెప్పాలి
  3. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకే హైడ్రా  
  4. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడి ఇల్లు కూల్చేశారు 
  5. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి   

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ‘హిమాయత్‌సాగర్‌లోని నా ఇల్లు బఫర్ జోన్‌లోగాని, ఎఫ్‌టీఎల్ పరిధిలోగాని ఉంటే కూల్చివే యాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నాను. కేటీఆర్, హరీశ్‌రావులు ఎప్పుడు వెళ్తారో తేదీ చెప్పండి. నేను అక్కడికి రాను. మీరే ఒక కొత్త టేప్ తీసుకెళ్లి కొలుసుకోవచ్చు. ఒక ఇటుక కూడా బపర్ జోనులో ఉన్నా కూల్చేయండి’ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తానుంటున్న ఇళ్లు తన కొడుకు పేరు మీద ఉందని, కేటీఆర్  చెప్పినట్టు దోస్త్‌ది లీజ్‌కు తీసుకున్నా అని చెప్పనని అన్నారు.

రూ.5 వేలకు లీజ్‌కు దొరికితే మేం కూడా లీజ్‌కు తీసుకుంటామని, తన ఇల్లు బఫర్ జోనులో లేకుంటే తల ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెప్పించుకొనే అవకాశం ఇవ్వనని స్పష్టంచేశారు. శుక్రవారం గాంధీభ వన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పార్టీ నేతలు సంగిశెట్టి జగదీశ్, భవానీరెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్‌తో కలిసి మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలు మోసపోవద్దని, చెరువులు, కుంట లు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికావద్దనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని ఉద్ఘాటించారు.

కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడి ఇల్లు కూడా బఫర్ జోనులో ఉంటే హైడ్రా అధికారులు కూల్చేశారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను బీఆర్‌ఎస్ నేతలు, వారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని విల్లాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. జన్వాడలో ఫాంహౌస్‌ను చూసేందుకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి వెళ్లితే, ఎవరో ఒకరు డ్రోన్ కెమెరా ఎగిరేస్తే రేవంత్‌రెడ్డిపై ప్రభుత్వంపై కేసులు ఎందుకు పెట్టిందో? సమాధానం చెప్పాలన్నారు. 

ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానన్న నాయకుడు ఆరేడు నెలలుగా కనిపించకుండా పోతాడని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలో ఛాలెంజ్ చేసి తాను నిలబెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రల సమస్య లేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడిని మీడియా ప్రశ్నించగా.. మహిళా జర్నలిస్టుపై జరిగిన దాడిని ప్రభుత్వం ఖండిస్తోందని తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులపై కేసులు పెట్టి ఎన్నో వేధింపులకు గురి చేసిందని చెప్పారు. 

రైతులు ఆందోళన చెందొద్దు 

రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, వాటిన్నింటిపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. వ్యవసాయ రుణాలకు రూ.31 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అప్పుడే అంచనా వేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లకుపైగా నిధులను కేవలం 26 రోజుల్లోనే విడుదల చేసిందని చెప్పారు.

మిగతా 13 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీకి సిద్ధంగా ఉందని, అవరసరమైతే మరో వెయ్యి.. రెండు వేల కోట్లను కూడా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న వారికి ఒక కటాఫ్ తేదీని పెట్టి, మిగతా డబ్బులను రైతు చెల్లిస్తే, ప్రభుత్వం రూ.2 లక్షలు బ్యాంకులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి చేసింది ఎంతో అందరికీ తెలుసని అన్నారు. 

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు 

సంక్షేమం, అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందని పొంగులేటి పేర్కొన్నారు. మార్పు ఇందిరమ్మ పార్టీతో సాధ్యమవుతుందని ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చామని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.3 లక్షల కోట్ల వరకే ఉన్నాయని అనుకుంటే.. అధికారంలోకి వచ్చాక చూస్తే రాష్ట్ర అప్పులు రూ.7.19 లక్షల కోట్లు ఉన్నట్టు తేలడంతో షాక్‌కు గురయ్యామని తెలిపారు. అయినా తాము భయపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టు స్పష్టంచేశారు.  బీఆర్‌ఎస్‌లా అబద్ధాలు చెప్పడం రాదని, 8 నెలల్లో చేసింది తాము చెప్పుకోలేకపోతున్నట్టు పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే జవహర్‌లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి ఇంటి స్థలాల పత్రాలను అందజేస్తామని మంత్రి తెలిపారు. 

వారంలోగా ధరణి  సమస్యలు పరిష్కారం 

వచ్చే వారంలోగా ధరణి సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి వెల్లడించారు. దేశానికి రోల్‌మోడల్‌గా ఉండే విధంగా రెవెన్యూచట్టాన్ని తీసుకుస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు పడలేదని ఇప్పుడు రైతులపైన కక్ష పెట్టుకుని రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో యువతను కూడా రెచ్చగొట్టాలని చూశారని గుర్తుచేశారు. రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులను వేర్వేరుగా ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, బీఆర్‌ఎస్ మాదిరిగా పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలను చూడమని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను మరమ్మతు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. 

మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే 

కాంగ్రెస్ పార్టీ, మంత్రుల మధ్య చిచ్చుపెట్టాలని బీఆర్‌ఎస్ నేతల ఆశలు నేరవేరవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.  రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు తన పేరును కూడా బీఆర్‌ఎస్ వాడుకుంటోందని ఆరోపించారు. మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే అని, తామందరం కలిసే ఉన్నామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ నేతల కలలు పగటి కలలే అవుతాయని అన్నారు.