2 August, 2026 | 10:04 PM

మహేష్‌కే పీసీసీ!

24-08-2024 01:03 AM

వర్కింగ్ ప్రెసిడెంట్ వైపే అధిష్ఠానం మొగ్గు 

ఏఐసీసీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి

ఖర్గే, రాహుల్‌తో సీఎం, మంత్రుల చర్చలు

క్యాబినెట్ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్‌పై చర్చ 

అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలని నిర్ణయం 

మహేష్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ పేర్లు పరిశీలన 

సీఎం దక్షిణ తెలంగాణకు.. పీసీసీ ఉత్తర తెలంగాణకు 

మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి చోటు 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కొత్త అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖారారైనట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఆయన శుక్రవారం హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు.

ఏ క్షణమైనా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్‌గౌడ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్ష పదవితోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు చర్చకు వచ్చినా.. మొదటి ప్రాధాన్యంగా పీసీసీ చీఫ్ ఎంపికపైన చర్చ జరిగినట్లు సమాచారం. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్‌గౌడ్ పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే దీపాదాస్ మున్షీ మాత్రం మధుయాష్కీగౌడ్ పేరును పరిశీలనలోకి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహేష్‌కుమార్‌గౌడ్ వైపే మొగ్గు చూపినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. 

లంబాలకు మంత్రి పదవి 

పీసీసీ అధ్యక్ష పదవి కోసం బీసీ సామాజికవర్గం నుంచి మహేష్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజి కవర్గం నుంచి ఎంపీ బలరాంనాయక్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత విప్ అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సీఎం పదవిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఉం డటంతో పీసీసీ బీసీలకు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

సీఎం పదవి దక్షిణ తెలంగాణకు ఉన్నందున.. పీసీసీ అధ్యక్ష పదవి ఉత్తర తెలంగాణకు ఇవ్వాలని హై కమాండ్ బలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాంతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కమార్ పేరును పరిశీలనలోకి తీసు కోలేదని సమాచారం. మహేష్‌కుమార్‌గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాం గ్రెస్‌లో వివిధ పదవులు చేపట్టడమే కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ బలోపేతం కోసం పని చేసిన విషయాన్ని అధిష్ఠానం గుర్తించిందని చెప్తున్నారు.

లంబాడా సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకే బలరాంనాయక్ పేరును పీసీసీ రేసు నుంచి పక్కన పెట్టారని సమాచారం. పీసీసీ చీఫ్‌గా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డినే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిం చి.. రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అనివార్యమైంది. సీఎం కూడా పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించాలని గతంలోనే పార్టీ హైకమాండ్‌ను కోరారు. మంత్రి విస్థరణపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అధిష్ఠానం సూచన మేరకు నలుగురి పేర్లను రాష్ట్ర నేతలు అందజేసినట్టు సమాచారం.