calender_icon.png 1 February, 2026 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను నమ్మండి.. ఇది గొప్ప చిత్రమవుతుంది!

31-01-2026 01:26:23 AM

యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటి స్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్న ఈ సినిమాతో జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ వేసవిలో థియేటర్లలో అడుగుపెట్టనుంది. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథి విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “భగవంతుడు’ టీజర్ చాలా బాగుంది.

నేను అర్బన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేస్తుంటా. కానీ నాకు ఇలాంటి గ్రామీణ నేపథ్య చిత్రాలంటే ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి” అన్నారు. ‘టీజర్ ఇంత బాగుంటుందని ఊహించలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాన’ని మరో అతిథి సందీప్ కిషన్ తెలిపారు. చిత్ర కథానాయకుడు తిరువీర్ మాట్లాడుతూ.. “ఈ కథ విన్న 5 నిమిషాలకే గొప్ప చిత్రమవుతుందనిపించింది. ఇక స్క్రిప్ట్ చెప్పడం వద్దు.. షూటింగ్ ఎప్పుడో చెప్పండి అన్నాను. అప్పటికి ‘మసూద’ హిట్ అయినా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ‘భగవంతుడు’కు చాలా బడ్జెట్ అవుతుంది నా మీద అంత పెడతారా? అనే సందేహం ఉండేది. నటుడిగా నువ్వు ఈ కథకు కావాలని వేణు ఊడుగుల, గోపి విహారి నాతో చెప్పారు.

నన్ను నమ్మండి ‘భగవంతుడు’ చాలా గొప్ప సినిమా అవుతుంది” అన్నారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారా? అని నన్ను అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ‘భగవంతుడు’ సినిమా నిలుస్తుంది” అని చెప్పారు. డైరెక్టర్ విహారి మాట్లాడుతూ.. “మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, సమాజంలో ఉన్న వైరుధ్యాలు తెలుసుకునేందుకు కథలు చెబుతాం. ఈ అవగాహనతో రూపొందించిన చిత్రమిది. పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు.

వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పారు. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్‌డ్రాప్ తీసుకున్నా” అని తెలిపారు. నిర్మాత రవి పనస మాట్లాడుతూ.. “డైరెక్టర్ ‘భగవంతుడు’ కథ చెప్పినప్పుడు అసురన్, కాంతార, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఏప్రిల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం” అన్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల, దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రొడ్యూసర్లు సునీల్ నారంగ్, సెవెన్ హిల్స్ సతీశ్, నటులు రిషి, క్రిష్, జబర్దస్త్ అభి, రవీందర్ విజయ్, మైమ్ మధు, మ్యూజిక్ డైరెక్టర్ కేపీ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.