విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులకు సాంకేతికతపై అవగాహన ఎంతైనా అవసరం
జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
గద్వాల (విజయక్రాంతి): మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకొని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా పాఠాలు బోధించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల బాలభవన్ లో విద్యాశాఖకు సంబంధించిన పలు యాప్ లు, వివిధ పోర్టల్ ల గురించి జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఐ, ఇతర టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరు మెరుగుపడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా తమ విధులు నిర్వహించాలన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు ప్రయోగపూర్వకంగా, వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రధానోపాధ్యాయుల హ్యాండ్బుకును కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు శాంతిరాజు, హంపయ్య, ఎంఈఓ లు, తదితరులు పాల్గొన్నారు.






