14 July, 2026 | 8:19 PM

బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి

14-07-2026 08:18 PM

- జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న సాంకేతిక సాధనాలను ఉపయోగించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని తిరుపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం, బొక్కల్ గూడ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నంబర్ -2)లో ఆంగ్ల భాష సబ్జెక్టు లపై ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'శిక్షా కో-పైలట్' సాఫ్ట్‌వేర్ పై నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఉపాధ్యాయులు సులభంగా పాఠ్యాంశాల ప్రణాళికను తయారు చేసుకోవచ్చని, అందుకు సంబంధించిన వీడియోలను, అదనపు సమాచారాన్ని పొంది విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని డిజిటల్ బోధన ద్వారా తరగతి గదుల్లో భాగస్వాములను చేయాలన్నారు. ఫిజికల్ సైన్స్, ఆంగ్లం ఉపాధ్యాయులు నిత్య జీవితంలో జరిగే అంశాలను, క్రీడలను శాస్త్ర సాంకేతికతతో ముడిపెట్టి బోధించాలని సూచించారు.

ఉపాధ్యాయులు పొందిన శిక్షణ వివరాలను, పాఠశాల భద్రతా ప్రణాళికలను యూ-డైస్ ప్లస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని 10% పెంచాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు నిరంతరం సమీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి మాధవి, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.