మంటల్లో టెహ్రాన్ ఎయిర్ పోర్టు
విమానాశ్రయం సమీపంలో భారీపేలుళ్లు
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ క్షిపణి దాడి
విమానాశ్రయం మూసేసిన యూఏఈ
ఇరాన్‌పై భారీదాడికి సిద్ధమైన అమెరికా?
టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్, మార్చి 7: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. శనివారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారీ పేలుళ్లు సంభవించగా మంటలు ఎగిసిపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఉన్న కమర్షియల్ విమానాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. భారీ అగ్నిఖీలలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతం కమ్ముకుపోయినట్లు, రాత్రంతా భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. టెహ్రాన్‌లో దాడుల తర్వాత ఆ ప్రాంతం లో ఒక్కసారిగా భారీ పొగలు కమ్ముకున్నాయి. పెట్రోలియం, ఆయిల్ నిల్వలు దగ్ధమవడమే ఇందుకు కారణమని తెలిసింది.
ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న షహరాక్ ఎక్బాతన్ అపార్ట్‌మెంట్ ప్రాంతానికి ఈ పొగలు వ్యాపిస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. ఇళ్లలోనే ఉండాలని, బయటకి రావొద్దని పేర్కొన్నారు. ఇంధనం, ఆయిల్ కాలిపోవడం వల్ల విషపూరిత వాయువులు గాల్లోకి వ్యాపిస్తున్నాయని తెలిపింది. అయితే పశ్చిమాసియాలోని దేశాలు యుద్ధంతో అట్టుడు కుతున్నాయి.
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై శనివారం ఇరాన్ క్షిపణి దాడి చేసింది. అలర్ట్ అయిన ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులను తరలించారు. మిస్సైల్ దాడితో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో దుబాయ్ విమాన సర్వీసులను ఎమిరేట్స్ తాత్కాలికంగా మూసేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను యూఏఈ వైమానిక దళం అడ్డుకుంది. చాలా విమానాలు రద్దయ్యాయి.
ఇరాన్‌పై భారీదాడికి సన్నద్ధమైన యూఎస్
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యం విజృంభిస్తోంది. ఇరాన్ కూడా అదేస్థాయిలో ఇజ్రాయెల్‌పై భీకర దాడులు చేస్తోంది. ఈ తరుణంలో అమెరికా.. ఇరాన్‌ను శనివారం తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్‌పై భారీ దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. టెహ్రాన్‌లోని క్షిపణి లాంచర్లు, మిస్సైల్ ఫ్యాక్టరీలే లక్ష్యంగా వాటిని పూర్తిగా విధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
మేము చేపట్టే అతి పెద్ద ఆపరేషన్‌గా ఉండనుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌బెసెంట్ పేర్కొన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం పెనుసంచలనం అవుతోంది.
ఆయన అన్నట్లుగానే టెహ్రాన్‌తోపాటు ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు తెలిసింది.




