జానపదుల సింగిడి తెలంగాణ
తెలంగాణ నేల మీద మళ్లీ డప్పు దరువు దద్దరిల్లుతున్నది. మట్టి పరి మళం ప్రపంచాన్ని పరవశింపజేస్తున్నది. ఒకప్పుడు ఎగతాళికి గురైన మన యాస, ఈరోజు కోట్లాది మం ది పెదవులపై పలుకుతున్నది. పల్లెటూరి పాటగా చిన్నచూపు చూసిన మన జానపదం ఇప్పుడు ప్రపంచ వేదికలపై మారుమోగుతున్నది. మన భాష, మన బతుకు, మన బంధాలు, మన సం స్కృతి యూట్యూబ్ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు గర్వంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సినిమాలు, టెలివిజన్లలో తెలంగాణ యాసను ఎక్కువగా హాస్యానికో, విలనిజానికో పరిమితం చేశారు. పల్లె మనిషి భాష ను అమాయకత్వానికి ప్రతీకగా చిత్రీకరించడంతో చాలామంది తమ సొంత యాసలో మాట్లాడ టానికే సంకోచించారు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. అది కేవలం కొత్త రాష్ట్రం ఆవిర్భావం కాదు.. ఒక నేల తన అస్తిత్వాన్ని, తన భాష ను, తన సంస్కృతిని తిరిగి గర్వంగా ప్రపంచం ముందుంచిన చారిత్రక ఘట్టం.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లా ది హృదయాలను తాకుతున్న ఈ గీతాలు అత్యాధునిక స్టూడియోల్లో పుట్టినవి కావు. ఇవి పల్లె దూళిలో పుట్టిన పాటలు.. రైతు చెమట సువాసనను, అమ్మ జోలపాట వెచ్చదనాన్ని, తెలంగాణ మట్టి పరిమళాన్ని మోసుకొచ్చిన స్వరాలు. ఒకప్పుడు ఊరి జాతరలు, బతుకమ్మ వేదికలు, ఇంటి అరుగులకే పరిమితమైన ఈ గొంతులు ఇప్పుడు ఖండాలు దాటి ప్రపంచ వేదికలపై మారుమోగుతున్నాయి.
వ్యూస్ కాదు.. ఇక్కడి గుండెచప్పుళ్లు
ఒక పాటకు కోట్లు వ్యూస్ రావడం ఈ డిజిటల్ యు గంలో కొత్త విషయం కాకపోవచ్చు. కానీ తెలంగాణ జానపద గీతాలకు లభిస్తున్న ఆదరణ మాత్రం ఒక నేల తన స్వరాన్ని ప్రపంచానికి తిరిగి వినిపించిన సాంస్కృతిక విజయగాథ. ‘రాను బొంబాయికి రాను’, ‘బుల్లెట్టు బండి’, ‘ఓ పిలగ ఎంకటి’, ‘సిటపాట సినుకులకు’, ‘దరిపొంతోతుండు’, ’పెద్ది రెడ్డి’, ’యెన్నలకు వచ్చినాయి జొ న్నల బండ్లు’తో పాటు ఇటీవల ట్రెండ్ సృష్టిస్తున్న ’బాసింగా బాసింగా’ వంటి జానపద గీతాలు కోట్లాది వ్యూస్ సాధిస్తూ తెలంగాణ యాస మాధుర్యాన్ని, పల్లె జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఇవి కేవలం డిజిటల్ అంకెలు కావు... తెలంగాణ సంస్కృతికి ప్రపంచం ఇచ్చిన గౌరవ వందనం.
ఈరోజు పెళ్లి పందిరి నుంచి బతుకమ్మ, బోనాల సంబరాల వరకు.. కాలేజీ వే డుకల నుంచి విదేశాల్లోని తెలుగు సంఘాల వేదికల వరకు ఎక్కడ చూసినా ఈ పాటలే మారుమ్రోగుతున్నా యి. పాట మొదలైతే అడుగులు కదులుతున్నాయి.. డప్పు మోగితే దరువులు దద్దరిల్లుతున్నాయి. తెలంగాణ యాస వినిపిస్తే హృదయాలు పులకరిస్తున్నాయి. ఈ గీతాలు వినోదాన్ని మాత్రమే కాదు.. ఒక నేల చరిత్రను, జీవన తత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి గర్వంగా చాటుతున్నాయి.
ఉద్యమ గీతాల నుంచి.. జీవన గీతాల వరకు
తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం కాదు... అది అస్తిత్వం కోసం సాగిన సాంస్కృతిక సమ రం. ఆ సమరంలో కత్తులు కాదు.. పాటలే ఆయుధాలయ్యాయి. తెలంగాణ వాగ్గేయకారుడు గద్దర్, గాయకురా లు విమలక్క, గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ వంటి మహనీయుల గీతాలు ఉద్యమానికి ఊపిరిగా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిధ్వనిగా, తెలంగాణ ఆత్మగౌరవానికి దిక్సూచిగా నిలిచా యి.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గొంతు మూగబోలేదు.. రూపం మాత్రమే మార్చుకుంది. ఒకప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించిన పాటలు, ఇప్పుడు జీవితాన్ని ఆలపి స్తున్నాయి. ఉద్యమ నినాదాల స్థానంలో ప్రేమ, లగ్గం సందడి, కుటుంబ అనుబంధాలు, అమ్మ మమకారం, రైతు చెమట, వలసల వేదన, పల్లె ముచ్చట్లు చోటు చేసుకున్నాయి. ‘బలగం’ వంటి చిత్రాలు ఈ జీవన తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఒకప్పుడు పాటను ప్రపంచానికి చేర్చాలంటే పెద్ద స్టూడియోలు అవసరం.
ఇప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్, హృదయంలో తెలంగాణ మట్టిపై ప్రేమ ఉంటే చాలు. డప్పు దరువుకు ఆధునిక బీట్ను జోడి స్తూ, సంప్రదాయానికి సాంకేతికతను మేళవిస్తూ ఈ కొత్త తరం తెలంగాణ జానపద సంగీతానికి కొత్త దిశను చూపుతున్నది. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరి పోసిన పాటలు... ఈరోజు తెలంగాణ జీవన విధానానికి అద్దంగా నిలుస్తున్నాయి.
పల్లె గుమ్మం దాటి..
ఒకప్పుడు అవకాశం కోసం హైదరాబాద్ స్టూడియో ల గడపలు తొక్కిన కళాకారులు... ఈరోజు తమ పల్లె గుమ్మం నుంచే ప్రపంచాన్ని పలకరిస్తున్నారు. నిర్మాతల కోసం ఎదురుచూసిన గొంతులు ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై కోట్లాది అభిమానాన్ని సంపాదిస్తున్నాయి. ప్రతిభకు చిరునామా నగరం కాదని, మట్టి మనిషి గొంతుకే ప్రపంచం చప్పట్లు కొడుతుందని ఈ తరం నిరూపించింది. మోహనా భోగరాజు, ప్రభా, రాము రాథోడ్, మామిడి మౌనిక, మంగ్లీ, మధుప్రియ, గజ్వేల్ వేణు, బుల్లెట్ బండి లక్ష్మణ్, జోగుల వెంకటేష్, గిద్దె రామ్ నర్సయ్య వంటి కళాకారులు తెలంగాణ మట్టి పరిమళాన్ని, పల్లె బతుకులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న సాంస్కృతిక రాయబారులుగా నిలిచారు.
అదే సమయంలో కిన్నెర మొగులయ్య, పెద్దపులి ఈశ్వర్, వి మలక్క వంటి సీనియర్ కళాకారులు తమ అనుభవాన్ని కొత్త తరానికి అందిస్తూ జానపద వారసత్వాన్ని సజీవం గా ఉంచుతున్నారు. పాత తరం అనుభవం, కొత్త తరం సాంకేతికత కలయికే తెలంగాణ జానపదానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. మరో విశేషమైన మా ర్పు మహిళల భాగస్వామ్యం. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన డప్పు దరువు, ఈరోజు అక్కాచెల్లెళ్ల చేతుల్లో నూ గర్వంగా మోగుతోంది.
గంగవ్వ.. తెలంగాణ మట్టి నవ్వినప్పుడు..
తెలంగాణ జానపద పునరుజ్జీవనానికి అత్యంత హృ ద్యమైన ప్రతీక మిల్కురి గంగవ్వ.జగిత్యాల జిల్లా లంబాడిపల్లెలో కూలీ పని చేసిన ఆమె... కట్టెలు మోసిన ఆమె... బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించిన ఆమె.. ఒకరోజు ‘మై విలేజ్ షో’ కెమెరా ముందు నిలబడి తన సహ జమై న తెలంగాణ యాసతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆమె నటించలేదు... జీవించింది. ఆమె సంభాషణల్లోని అమాయకత్వం, హాస్యం, సహజత్వం లక్షలాది మంది హృద యాలను గెలుచుకున్నాయి.
బిలియన్కు పైగా వ్యూస్, బిగ్బాస్లో ప్రవేశం, సినిమాల్లో అవకాశాలు... ఇవన్నీ ఒక పల్లె అవ్వ సాధించిన విజయాలు మాత్రమే కాదు. ప్రతిభకు వయస్సు, పేదరికం, గ్రామీణ నేపథ్యం అడ్డుకాదని నిరూపించిన చరిత్ర. ఒకప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడటానికే చాలామంది సంకోచించారు. బయటకు వెళ్లినప్పుడు తమ మాండలికాన్ని దాచుకునేవారు. సినిమాలు, టెలివిజన్లలో మన మాటను హాస్యానికో, విలనిజానికో పరిమితం చేసిన రోజుల ప్రభావం అది.
కానీ కాలం మారింది... తెలంగాణ మారింది... మన ఆత్మవిశ్వాసం మారింది. ఈరోజు అదే యాస ట్రెండ్. ఒకప్పుడు చిన్నచూపు చూసిన తెలంగాణ పలుకులు... ఈరోజు కోట్లాది మంది పెదవులపై పలుకుతున్నాయి. పల్లె గడప దాటని మన జానపద గీతాలు... ప్రపంచ వేదికలపై మారుమోగుతున్నాయి. బతుకమ్మ రంగులు, బోనాల వైభవం, లగ్గం సందడులు, పల్లె బంధాలు, కుటుంబ అనుబంధాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్
సెల్: 90101 28884ఎ






