17 August, 2026 | 1:09 AM

బిల్లులు రైతు చేతుల్లో.. ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడ?

17-08-2026 12:00 AM
  1. మూడేళ్లుగా పట్టించుకోవట్లే 
  2. విద్యుత్ శాఖ అధికారుల మాయజాలమేనా?
  3. ఇక్కడ డీడీలు చెల్లించాలా.. చేతులు తడపాలా!
  4. విద్యుత్ శాఖ తీరుపై రైతుల అసహనం
  5. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన వైనం 

మహమ్మాదాబాద్, ఆగస్టు 16 : రైతు అందరికీ అన్నదాత.. పండించే పంట చేతికి వచ్చేందుకు ఆ దేవుడైన సహకరిస్తాడేమో.. కాగా ఇక్కడ విద్యుత్ శాఖ యంత్రాంగం మాత్రం మొండికేస్తుంది. ఆ శాఖ నియమ నిబంధనలు పాటించి నంచర్ల గ్రామానికి చెందిన రైతులు డీడీలు చెల్లించి మాకు ట్రాన్స్ఫార్మర్ అందించండి మహోప్రబో అంటూ గత మూడేళ్లుగా వేడుకుంటున్న ఆ ట్రాన్స్ఫార్మర్ మాత్రం రైతు పొలానికి చేరుకోలేదంట.

ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.. ట్రా న్స్ఫార్మర్ కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్ కంటే ముందుగానే బిల్లులు వచ్చేస్తున్నాయంట. అదేంటి ట్రాన్స్ఫార్మర్ ఉంచిన తర్వాత విద్యుత్తు కనెక్షన్లు రావాలి కదా అనుకుంటే తప్పే అవుతుదేమో. అదే కదా మన విద్యుత్ శాఖ కొందరి అధికారుల తీరు అట్లా ఉంది. అడిగితే ఎందుకు మమ్మల్ని సతాయిస్తున్నా రు మేము ఎలాంటి తప్పు చేయలేదంటారు..

రైతులేమో గత మూడేళ్లుగా మాకు ట్రాన్స్ఫర్  ఇవ్వడం లేదు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి బిల్లులు తప్పకుండా కడుతున్నాం అంటూ కన్నీరు అవుతున్నారు. మూడేళ్ల నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ జరగలేదా? అంటే జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆ రైతుకు చేరకుండా ఏ రైతుకు చేరింది? మా ట్రాన్స్ఫార్మర్ జాడ ఎవరు చెప్తారని రైతులు సంబంధిత అధికారులను వేడుకుంటుండ్రు.

రైతు పొలం దాటి రారనే ధైర్యమా?

 రైతు నిత్యం సాగుచేసిన పొలం చుట్టూ తిరుగుతూ రోడ్డు పైకి రారు అనే ధైర్యంతోనే రైతుల దరిచేరవలసిన ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ పోయింది అంటూ రైతు ప్రశ్నిస్తుండు.  విద్యుత్ శాఖ మండల ఏఈ లు మారుతున్నారు?అప్పుడు ఆ ఏఈ ఉండే? ఇప్పుడు నేను వచ్చినా? మొన్ననే నేను ట్రాన్స్ఫర్ అయిన మరో కొత్త సార్ వచ్చారు? అంటు కార్యాలయల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ సతాయిస్తున్నారని, ఇలా అధికారులు మారుతున్నారు తప్ప తమకు రావలసిన ట్రాన్స్ఫార్మర్ మాత్రం తమ పొలానికి రావడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు.

ప్రమాదకరమైన విధి నిర్వహణ చేస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులకు జీతభత్యాలతో పాటు అవసరమైన సౌకర్యాలు అత్యధికంగా ప్రభుత్వం ఇస్తుంది. కాగా రైతుల జీవితాలను ప్రమాదకరంగా చేస్తూ వారికి వెన్నంటే ఉండి నిర్లక్ష్య ధోరణితో అందించాల్సిన సేవలు అందించ కుండా పక్కదారి పట్టినందుకు సహకరిస్తూ అడుగులు వేయడం ఎంతవరకు సమంజ సం అని జనం అసహనం వ్యక్తం చేస్తుండ్రు. విజిలెన్స్ అధికారి మహిబూబ్ అలీ ఈ విషయం పై విచారణ చేసి ట్రాన్స్ఫర్ మంజూరు అయినదని తెలిపారు. 

ప్రదక్షిణలు చేస్తేనే ఫలితం దక్కుతుందా!

దినం దినం క్రమం తప్పకుండా పొలానికి వెళ్లి సాగుచేసిన పంటను చేతికి వచ్చేలా శ్రమించాల్సిన రైతు ఆ పనులను పక్కనపెట్టి కార్యాలయాల చుట్టూ తిరిగితే ఫలితం దక్కుతుందా. ఇదెక్కటి విధానం అప్పుడు ఇప్పు డు వారు వీరు అంటూ కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు ఎవరు తీసుకోవాలి? కిందిస్థాయిలో ఏమి జరుగుతుంది? పర్యవేక్షణ ఎవరు చేయాలి? ఇలా ఎన్నో సందేహాలను నివృత్తి చేసే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? అధికారులకు విధి నిర్వహణ తప్ప అంతకంటే ముఖ్య మైన పనులు ఏముంటాయి.

ఇది ఒక్కటే కాదు ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంధించే ఈ ప్రశ్నలు, సమాధానాలు అధికారులే స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే సంబంధిత రైతులకు న్యాయం చేయడంతో పాటు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గిట్ల అయితే ఎట్లా బతకాలి..

ట్రాన్స్ఫార్మర్ ఇవ్వండి అని అడగని రోజు లేదు. కరెంటు వాళ్లను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం. వారు అప్పుడు ఇప్పుడు అంటూ పట్టించుకోవట్లేదు. జర మా ట్రాన్స్ఫార్మర్ మాకు వచ్చేలా చూడండి బిడ్డ.

 పుల్లరి సాయన్న, రైతు, నంచర్ల

 కాళ్లు మొక్కేదొక్కటే తక్కువ..

అడిగితే ఇంత కూడా పట్టించుకోకుంటే ఎట్లా. ఇంకా కాళ్ళు మొక్కేదొక్కటే తక్కువ ఉంది. డీడీలు కట్టిన ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలే. ఎప్పుడు ఇస్తారు ఎవరు ఇస్తారు..తెలుస్తలేదు. అసలు ఇస్తారా ఇవ్వరా.. పైసలు అయితే కట్టినం. ట్రాన్స్ఫార్మర్ ఇస్తే బాగుండే. వేరే వాళ్లకు వస్తున్నాయి. 

 శ్రీనివాసులు, రైతు, నంచర్ల 

పూర్తి వివరాలు తీసుకుంటాను..

 రైతులు డీడీలు చెల్లించిన విషయం తెలిసింది. పూర్తిస్థాయిలో ఎక్కడ ఏం జరిగిందని విషయాలను తెలుసుకుని వారికి న్యాయం చేస్తాం.ప్రస్తుత    ఏఈ 

           శ్రీవిద్య, మహమ్మదాబాద్ 

విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తాం..

 పక్కనే ఒక రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఉంది. వారితో మాట్లాడి విద్యుత్తు కనెక్షన్ గతంలో ఉన్నదానికి తీసివేసి కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 

     పూర్వపు ఏఈ సత్యం, మహమ్మాదాబాద్