ఆధునిక సమాజ దర్పణం ‘సెల్ఫీ’
అసమానతలు, విభిన్న మనస్తత్వాలు గల సమాజంలో, జీవితం ఒక్కొక్కరికీ ఒక రకమైన అనుభూతినిస్తుంది. జీవితం ఒకరికి వారసత్వం పట్టంకడితే, మరొకరికి పోరాడి గెలిచిన తర్వాతే సిం హాసనాన్ని అందిస్తుంది. జీవితాన్ని కొందరు షడ్రుచులుగా అనుభూతి చెందితే.. కొందరు తీపీ చేదు అనే సుఖదుఃఖాలు మాత్రమే అంటారు. వివిధ రకాల జీవితాలను పలు కోణాలలో అక్షరబద్ధం చేసి చూపిన కథ, చదివిన పాఠకులందరికీ ఒకే రకమైన అనుభూతినీ అనుభవాన్నిచ్చి, ఒకే పాఠాన్ని బోధించక పోవచ్చు.. కానీ ఆలోచింపజేస్తాయి.
ఒక కథకుడు కూడా సమాజం నుంచి తాను స్వీకరించిన విషయం పట్ల, అతడిలో వెటకారమో, హాస్యమో, ఆవేశమో, భయమో, కరుణో ఇత్యాది భావాలు కలుగవచ్చు. దానిని సమాజానికి కథ ద్వారా ఏ రసంలో అందించాలో కథకుడు నిర్ణయించుకుంటాడు. సారంగ వడ్డేపల్లి వెలువరించిన ‘సెల్ఫీ’ కథా సంపుటి చదివినప్పుడు మనకు అదే అనిపిస్తుంది. ఈ కథకుడి కథల్లో కరుణ, మేల్కొలుపు, ఆవేదన, హాస్యం, వెటకారం పలు రసాల్లో సమ్మిళితమై ఉంటాయి.
పాఠకులను అదే రీతిలో ఆస్వాదింపజేస్తాయడంలో అతిశయోక్తి లేదు. శీర్షికలు కూడా చదువక మునుపే పాఠకుడిని జాగ్రత్త పరుస్తాయి. పుస్తకం శీర్షిక ‘సెల్ఫీ’ ఆధునిక సమాజంలో నిత్యావసర వస్తువుగా నిత్యజీవితంలో ‘సెల్ఫీ’ తన స్థానాన్ని పదిలపరుచుకున్నది. ఇది కాదనలేని సత్యం. విద్యుత్తు ఉన్న చోట అపా యం అని ఉంటుంది. ‘సెల్ఫీ’ అన్నప్పుడు ‘ప్రమాదం’ పొంచి ఉన్నదనిపిస్తుంది. అంతటి శక్తిమంతమైన ‘సెల్ఫీ’ ఈ కథల సంకలనానికి పెట్టటం అభినందనీయం.
కథల్లో భిన్న వ్యక్తీకరణ
కొన్ని కథలకు ఆంగ్ల శీర్షికలు ఎంపిక చేయడం కొందరికి ఇబ్బంది అనిపించవచ్చు.. కానీ అవి కథలోని విషయానికి మరింత బలాన్నిచ్చిందని అనుకోక తప్పదు. సమాజంలో ఎప్పటినుండో స్త్రీకి రక్షణ కరువ యింది, అణచివేత కూడా ఉందని అనుకుంటున్నాం. అలాగే నేటి ఆధునిక సమాజంలో స్త్రీ పురుషులెవరికీ రక్షణ లేకుండా పోయిందనేది కొన్ని వార్తలు చదివినప్పుడు తెలుస్తున్నది. ‘ది పవర్’ అనే కథ స్త్రీలు పోరాట విద్యలను నేర్చుకొని తీరాలని చెబుతుంది.
తల్లిదండ్రులు బాలికలకు చిన్నప్పటినుండే కరాటే వంటి విద్యలు తప్పక నేర్పించాలని బోధిస్తుంది. కథ ఆరంభం నుంచి ఉత్కంఠగా సాగుతుంది. చిన్నచిన్న మానసిక బలహీనతల వల్ల కాపురాలు కలతలకులోనై ఇబ్బందులు ఎదుర్కోవటం, భార్యా బాధితుల సంఘాలూ ఏర్పాటు కావడం చూస్తున్నాం.. ఈ సమస్యలను ఎత్తి చూపిన కథ. ‘మంత్రోపదేశం’ కథ హాస్యం, వెటకారంతో సాగుతుంది. సహనంలేని కోపిష్టి భార్య వల్ల సంసారం ఎంత నరకంగా ఉంటుందో..
ఇరుగు పొరుగుకు ఈ కాపురం ఎలా కాలక్షేపాన్నిస్తోందో.. సంసారంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరియడం మంచిదనే ఆలోచన కలిగిస్తుంది. ఆకర్షణీయంగా ఆకట్టుకొని హంగులతో ఎరవేసి మనిషిని వినియోగదారుడిగా ముద్రవేసి నిలువు దోపిడీ చేయడం నేటి కార్పొరేట్ నైజం. దోపిడీ విషయంలో మనిషిని జాగూరతపరిచే కథ ‘స్మా ర్ట్ వర్క్’ ఇది ఆటోమొబైల్ మాఫియా ఎలా ఉంటుందో తెలియపరుస్తుంది. కారు ఏసీ చెడిపోయినప్పుడు. ఆథరైజ్డ్ షోరూంలో మరమ్మతు ఖర్చులు పెద్దమొత్తం అంచనా వేయడం.. బయట సాధారణ మెకానిక్ వేసిన ఛార్జ్ చూసి యజమాని నోరువెళ్లబెట్టడం చూస్తూనే ఉంటాం.
సామాజిక రుగ్మతలపై
మానవజాతిని భయభ్రాంతులకు గురిచేసేది వైద్యం మాఫియా.. సంపాదన.. సుఖసంతోషాలు.. పోటీతత్వం, పెరిగిన అవసరాలు, అత్యవస రాలు, ఆడంబరాలు మనిషిని చాలా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో రక్తపో టు, గుండె రకరకాల జబ్బులు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు అనవసర వైద్యపరీక్షలు, రోగిని భయపెట్టి దోచుకుంటారనే నమ్మకం ప్రజ ల్లో పెరిగిపోయింది. ఏది గుండె జబ్బు? అవును, కాదు.. కొంత అవగాహన కలిగిస్తూ సమస్య వచ్చినప్పుడు తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపే కథ ‘నిశ్శబ్ద మృత్యువు’.
ఒకప్పుడు ఫోన్ అత్యవసర సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. కానీ నేడు సెల్ ఫోన్ మానవజీవితాల్లోకి ప్రవేశించి జీవితాలను.. ఆరోగ్యాలను.. ప్రభావితం చేయగలిగే మార్పును తెచ్చిందనడంలో సందేహమే లేదు. అదెలాంటి ప్రభావం చూపుతున్నదో తెలిపే కథల్లో ఒకటి ‘సెల్ఫీ’. నిజ జీవితంలో ఎన్నో విషాదాలను వటగట్టుకు న్నది సెల్ఫీ. ఒక విష సర్పంతో సైయ్యాటలాడి కొందరు.. నీటమునిగి కొంద రు.. ఎత్తున ప్రాంతం నుంచి కిందపడికొందరు.. విష సర్పంతో సెల్ఫీ తీసుకొని కొం దరు చనిపోయిన వార్తలు ఎన్నింటినో చూస్తున్నాం.. ‘సెల్ఫీ’ తీసుకునే మోజులో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఈ కథ చెబుతుంది. టైగర్ ఎంక్లోజర్‌లోకి మతిస్థిమితం లేని వాడు దూకిన సమయంలో ‘అతడిని ఎలా కాపాడాలి’ అని టెన్షన్ పడ్డవారు కొందరైతే.. వీడియోలు ఫొటోలు తీయడంలో తలమునకలైన వారు మరికొందరు..
వినోదం విషాదం ఉత్కంఠ ప్రమాదం అనే సందర్భాల విషయంలో ఎలా ప్రవర్తించాలో అనే వివేకాన్ని కొందరు ఎలా కోల్పోతున్నారనేది ఒక కోణం.. మరో కోణం అప్పుల బాధలో ఉన్న వ్యక్తి.. అలాగే చనిపోవాలనుకునే ఊహ కలిగిన వ్యక్తి.. దానికి గల కారణాలు..చివరికి ఏమి జరిగిందో కథ చదువవలసినదే ‘ది వైట్ టైగర్’ కథ. ఒక చర్చించుకోవలసిన విషయాన్ని అద్దంలో చూపిన మరో కథ ఇది.. అసలు రచయితలు, కవులు తమ రచనలద్వారా కీర్తి గడించడం గతం.. నేడు పురస్కారాల కోసం.. వైయోక్తిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో తెలిపిన కథ.. పురస్కారాలు అమ్ముకునేందుకు అంగళ్లు తెరిచి కవులు, రచయితల బలహీనతలను రెచ్చగొట్టి దోచుకునే సందర్భాలను చూపిందీ ‘అవార్డులు - సన్మానాలు’ కథ.
మూఢ నమ్మకాలపై అస్త్రం
ప్రజల్లో గూడుకట్టుకున్న భక్తి, వఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని డబ్బు గడించే తెలివైన సోమరిపోతులు కొందరు బాబాల వేషంలో చేస్తున్న అకృత్యాలను వెటకారం హాస్యంతో.. ఒక్క చెంపపెట్టుతో గుడ్డిగా నమ్మేవారిని మేల్కొల్పి హెచ్చరించిన కథ ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’. ‘లోతు తెలియనిదే దూకకు’ మనందరికీ తెలిసిన నీతి.. ఎక్కువ సందర్భాలు, శుభకార్యాలు, పండుగ వేళల్లో యువకులు ఈతలో పనికిమాలిన పోటీలు పడడం దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలిపిన కథ ‘ఏది ముగింపు’.
బాల్య మిత్రులకు విలువనిస్తూ.. వారి ఫోన్ నెంబర్లు ఎంతో కష్టంతో సేకరించి.. వారిని వెతుక్కుంటూ వెళ్లిన స్నేహితుడికి ఎదురైన పరిస్థితులను తెలిపే ‘బాల్య స్నేహితుల కథ’. ఇవే కాకుండా సంకలనంలోని మరిన్ని కథలు.. మనిషి తత్వాన్ని.. మన బలహీనతలను సైతం మనముందు నిలబెట్టినవి ఉన్నాయి. సారంగ వడ్డేపల్లి సమాజాన్ని, సాహిత్యాన్ని సునిశిత దృష్టితో అధ్యయనం చేసి రాసిన కథలివి. కథకుడికి అభినందనలు.






