తెలంగాణ అక్కడి భూమిపుత్రులదే
- రానివ్వమని చెప్పడంపైనే నా అభ్యంతరం
- రాహుల్ గాంధీ, ప్రియాంక వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా?
- కేటీఆర్ సోదరుడితో సమానం
- తెలంగాణ, గద్దర్ కుటుంబ సభ్యులపై నాకు గౌరవం ఉంది
- జనసేన నుంచి తెలంగాణ పుత్రులే పోటీ చేస్తారు
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఆ భూమిపుత్రులదే దాన్ని ఎవరూ కాదనలేరు. గద్దర్ వంటి వారు ఎప్పుడూ ఇలా ఎవరినీ రావొద్దు అనలేదు. తెలంగాణలోకి రానివ్వమని చెప్పడంపైనే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను’ అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వవన్ ఇటీవల తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ఆయన కాస్త వెనక్కి తగ్గారు. తెలంగాణలో తన ఇల్లు ఉందని, తాను అక్కడికి వెళ్లకూడదా అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లినా ‘నాకు ఇబ్బంది కలగలేదు’ అని, రాహుల్ గాంధీ, ప్రియాంక వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా? అని ప్రశ్నించారు. కేటీఆర్ సోదరుడితో సమానమని, ‘తెలంగాణ అన్నా, గద్దర్ కుటుంబ సభ్యులన్నా నాకు గౌరవం ఉంది’ అని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు తెలంగాణపై భావోద్వేగమైన కనెక్టివిటీ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో అది లేదని చెప్పారు. తెలంగాణ కోసం పనిచేస్తామని, జనసేన నుంచి తెలంగాణ పుత్రులే పోటీ చేస్తారని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు.
అమరావతిలో బుధవారం మీడియాతో పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. గద్దర్ వంటి వారు ఎప్పుడూ ఇలా ఎవరినీ రావొద్దని మాట్లాడలేదన్నారు. ఆంధ్రా నాయకులు ఎవరూ వెళ్లి తెలంగాణలో పోటీ చేయట్లేదు. తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారిందని, విద్వేషాలకు ముగింపు పలకాలనేదే నా ఆలోచన అని అన్నారు. తెలంగాణలో జరిగిన ఘటనలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిసి జరిగిందని తాను అనుకోవడం లేదని తెలిపారు.
దేశంలో నచ్చిన చోట బతకొచ్చని, అది వారి హక్కు అని, కాలరాసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. కశ్మీరీ పండిట్లను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొడితే ఏమైందని ప్రశ్నించారు. 2014 వరకు తెలంగాణ నేతలు పోరు పెడితే అక్కడికి వెళ్లానని చెప్పారు. పుష్కరకాలం తర్వాత కూడా అంత ద్వేషం ఊహించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవన్నారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడ లేదని తెలిపారు. రాష్ట్రాలు విభజించుకుంటూ వెళితే ఎక్కడికి వెళతామన్నారు. భూమికి సరిహద్దులు ఉంటాయని, మనసుకు ఉండదన్నా రు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడంలేదన్నారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే దేన్నయినా గట్టిగా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ సమా జంలో ఆ రాష్ట్ర ప్రజలకు తమ ప్రాంతం పట్ల ఒక బలమైన నినాదం, ఉనికి, భావోద్వేగభరితమైన కనెక్టివిటీ ఉన్నాయని కొనియాడారు. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ‘ఆంధ్రా’ అనే ఒక ప్రాంతీయ ఉనికి కనిపించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఉనికి స్థానంలో కేవలం కులాల కొట్లాటలు, కుల రాజకీయాలే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కుల దూషణల సంస్కృతి పరాకాష్టకు చేరిందని, కొందరు సోషల్ మీడియా వేదికగా కులాల పేరుతో అసభ్యకరమైన దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. దీనికి ముగింపు పలకడానికే జనసేన తరఫున ‘సేనాగళం’ అనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదు : ఏపీ సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చన్నారు. గతంలో తానూ తమిళనాడుకి వెళ్లి ప్రచా రం చేశానని చెప్పారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్‌ఎస్ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా.. ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
అమెరికాలో కూడా తెలుగువారు సెనేటర్లు అవుతున్నారు.. ప్రజాసేవ చేసినవారినే ప్రజలు ఆదరిస్తారని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోందని, ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెం దుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదని, తెలుగువారిగా కలిసికట్టుగా ఉండాలి.. రెండు రాష్ట్రాలనూ ప్రగతి పథంలో నడిపించుకోవడమే అంద రి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలన్నారు.






