కాబోయే సీఎం బీసీ

05-10-2026 | 05:30am

రాహుల్, ఖర్గే ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట చెప్తున్న: మహేశ్ గౌడ్

  1. క్యాబినెట్, నామినేటెడ్ పదవుల్లో బీసీల సంఖ్య మరింత పెంచుతం
  2. 2039 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం
  3. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తం
  4. బీసీలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తున్నది
  5. జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్ తొలగించడం ఏమిటి?: పీసీసీ చీఫ్
  6. దేశవ్యాప్త కులగణనకు ఐక్య ఉద్యమం: మంత్రి పొన్నం
  7. శంషాబాద్‌లో ఘనంగా ఓబీసీ సింహ గర్జన
  8. రాష్ట్ర నమూనాతో కేంద్రం కులగణన చేపట్టాలని నేతల డిమాండ్

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రి(BC leader Chief Minister) అవుతారని.. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ధైర్యంతోనే ఈ విషయం ఘంటాపథంగా చెప్తున్నానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్(PCC President Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతో ‘ఎవరి జనాభా ఎంత ఉందో.. వారికి అంత ప్రాతినిధ్యం దక్కాలి’ అనే నినాదానికి బలమైన పునాది పడిందన్నారు.

బీసీలకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటాను గౌరవప్రదంగా తీసుకుంటామని, అవసరమైతే పోరాడి లాక్కుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శంషాబాద్‌లోని గొల్లపల్లిలో పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఓబీసీ సింహగర్జన బహిరంగ సభ జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఓబీసీల నిజమైన రక్షకుడు రాహుల్ గాంధీ అని, ఆయన త్వరలోనే ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2039 వరకూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉం టుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లతో అధికారంలోకి వస్తామన్నారు.  

బీసీలకు బీజేపీ ద్రోహం..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడ్తున్న జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ కాల మ్స్ ఉంచి ఓబీసీ కాలమ్ తొలగించడం ఏమిటని, దీంతో బీసీలకు బీజేపీ తీవ్ర ద్రోహం చేస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రశ్నించే ధైర్యం తెలంగాణలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు, మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం సీట్లు బీసీలకే కేటాయించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో క్యాబినెట్, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో బీసీల సంఖ్యను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అని, అందుకే బీసీల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదని, ఇందుకు జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్ పెట్టకపోవడమే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశమంతా సమగ్ర కులగణన చేపట్టాలి: పొన్నం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని.. దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించిన అంశం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు.

దీని కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఐక్యతే విజయానికి కారణమైందని.. అదే స్ఫూర్తితో ఇప్పుడు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

రిజర్వేషన్ల విషయంలో ప్రామాణికమైన గణాంకాలు అత్యంత కీలకం అని, ప్రామాణికమైన గణాంకాల కోసం దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాల కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని.. గ్రామసభల్లో కులగణనకు అనుకూలంగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలని నేతలకు సూచించారు. 

రాష్ట్ర నమూనాతో కేంద్రం కులగణన చేపట్టాలి: నేతలు

జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్, స్పష్టమైన కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  డిమాండ్ చేశారు. సరైన శాస్త్రీయ డేటా లేకపోవడంతోనే బీసీలకు  తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. శాస్త్రీయ జనాభా లెక్కల ఆధారంగానే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు తగిన వాటా, రిజర్వేషన్లు దక్కుతాయని ఆయన తెలిపారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జాతీయ జనగణనలో బీసీలకు ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట కోడ్ కేటాయించకపోవడంతో ఎంత మంది బీసీలు ఉన్నారనే దానిపై స్పష్టత కొరవడుతున్నదన్నారు. శాస్త్రీయ ప్రాతిపదికన లెక్కలు తేల్చకపోవడమే బీసీల వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ..

హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా కులగణన దిశగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. జనగణనలో బీసీ కాలమ్ చేర్చకపోవడం వల్ల సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్  మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీల గణనను పక్కనపెడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.

తాజా మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణనకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారని, ఇది బీసీ సంక్షేమానికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని విమర్శించారు. కాగా, రాష్ట్రంలో చేపట్టిన కులగణన నమూనా తరహాలోనే, కేంద్రం సమగ్ర శాస్త్రీయ సర్వే ద్వారా బీసీల జనాభాను తేల్చి, వారికి దక్కాల్సిన ప్రాతినిధ్యాన్ని కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీలు వీ హనుమంతరావు, అంజన్ కుమార్, ఏఐసీసీ నేత వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, నేతలు జ్యోతి, ఇందిరా శోభన్, ధనలక్ష్మి, యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, జంగారెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు