4 April, 2026 | 6:47 PM

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా

02-12-2024 07:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. బూటకపు ఎన్ కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది వాదించారు. వారి భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకుని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినట్లు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయన్న న్యాయవాది మృతదేహాలను కనీసం కుటుంబసభ్యులకు చూపించకుండానే పోస్టుమార్టం చేశారని ఆరోపించారు.

ఎన్ హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అయితే పోలీసుల భద్రత దృష్ట్యా మావోయిస్టుల మృతదేహాలను ములుగు దవాఖానకు తరలించి, నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారని, దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచి, వారి కుటుంబసభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.