కుటుంబ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బందీ
- రాష్ట్ర నిధులను ఢిల్లీకి మోయడమే పని
- తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు కేటాయిస్తుంది
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పదేళ్లు కేసీఆర్ కుటుంబ పాలనలో, గత రెండున్నరేళ్లుగా సోనియాగాంధీ కుటుంబ ఆధీనంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బందీగా మారిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కుటుంబ, అవినీతి రాజకీయాల నుంచి తెలంగాణను కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా గాలికొది లేసిందని, రాష్ట్ర నిధులను ఢిల్లీకి మోయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ విమర్శలతో తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు అందిస్తోందని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.1.85 లక్షల కోట్లు మంజూరు చేశామని, రాష్ట్రానికి ఐదు వందే భారత్ రైళ్లు, ఆరు అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు.
ఈ అభివృద్ధి పనులు రాహుల్ గాంధీ ఇచ్చారా? లేక కేసీఆర్ తెచ్చారా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించిన కిషన్‌రెడ్డి.. బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసే పార్టీ అని స్పష్టం చేశారు. అందుకే ప్రజలు వరుసగా మూడుసార్లు కేంద్రంలో బీజేపీకి అధికారాన్ని ఇచ్చారని, ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచామని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న వారికి అభివృద్ధి పనులే సమాధానమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లాగా మాట ఇచ్చి మోసం చేసే పార్టీ కాదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారి మాట్లాడుతోందని విమర్శించారు.






