22-07-2025 06:17:09 PM
ఎమ్మెల్యే మురళి నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. మంగళవారం మహబూబాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఇవ్వడం జరిగిందన్నారు. దీని ద్వారా కొత్తగా రేషన్ కార్డులో నమోదు, తొలగింపు, సవరణ అన్నీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులువుగా నిర్వహించే విధంగా రూపొందించామని చెప్పారు.
దీని కోసమే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఆర్థికంగా తిప్పలు వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, నాయకులు అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.