05-07-2025 12:11:25 AM
మద్దతు లేఖను కల్వకుంట్ల కవితకు అందించిన మహాసభ నేతలు
గజ్వేల్, జులై 4: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బిసి డిక్లరేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతo రిజర్వేషన్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఎమ్మెల్సీ కవిత చేపట్టిన రైల్ రోకోకు శుక్రవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ నేతృత్వంలో నాయకులు కవితకు మద్దతు లేఖను అందజేయగా, సమాజంలో అట్టడుగున నిలిచిన బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
బీసీలకు అన్ని రంగాల్లో అవకాశం దక్కేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుండగా, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు.