07-02-2026 07:43:30 PM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
కాగజ్‌నగర్ (విజయ క్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్‌పీఎం క్రికెట్ మైదానంలో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే మున్సిపాలిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. గ్రామాలే కాకుండా పట్టణాల అభివృద్ధిపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
UIDF, 15వ ఆర్థిక సంఘం, అమృత్ పథకాల కింద మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తోందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుధ్య నిర్వహణ కోసం కూడా కేంద్రం విస్తృతంగా నిధులు అందిస్తోందని చెప్పారు. ఈ సభలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నాగేష్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధులు తీసుకువచ్చామని తెలిపారు. పలు రైళ్లకు హాల్టింగ్‌లు కల్పించడంతో పాటు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వయి హరీష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనూ, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనూ పట్టణానికి ఒరిగింది ఏమీ లేదని, పట్టణం మురికివాడలా తయారైందని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, రెండు రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.