మన మాట, మన భాష, మన ఉనికి
నేల తల్లీ, భాషామ తల్లీ రెండూ సమాన ధర్మాలు ప్రోది(Equal virtues are born.) చేసుకున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. మట్టితో కూడిన నేల ఎన్నెన్ని రకాల పచ్చదనాలకు, ఎన్నెన్ని వర్ణాల పుష్పాలకు, ఎన్నెన్ని రకాల వక్షాలకు ఆలంబనమో, అక్షరాల గుచ్ఛమైన భాష కూడా అనేకమైన ప్రక్రియలతో విలసిల్లే సాహిత్యాది రచనలతో, గ్రంథాలతో , కావ్యాలతో, శాస్త్రాలతో విలసిల్లుతూ ఉంటుంది. మాటల తోటలైన భాషలు, ఒక్కో పరిమళంతో గుబా ళిస్తూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి.
అటువంటి జీవనం మన ఉనికిని రక్షిస్తూ, దానికి వెలుగునిస్తూ ఉంటుంది. నేడు భాషల ఘోషలు సముద్ర కెరటాల్లా, అవిశ్రాంతంగా, భూగోళం మీద పరుగు పందాలతో జుట్లు పట్టుకుంటున్నాయి. రాజకీయ యవనిక మీద రంగులు చెరిగిపోతున్న తమ తమ జెండాలని సవర్ణంగా, సాధికారంగా, తమ తమ నేల దిబ్బల, తిరిగి పాతుకోవాలని పాకులాడుతున్నాయి.. పోరు బాట పడుతున్నాయి. ఈ సంద ర్భంలో ఓ చిన్న ముచ్చట ఇక్కడ ఉటంకిస్తున్నాను.
డా.నాగసూరి వేణుగోపాల్, కన్వీనర్, గాంధీ దర్శన్ గారు తన ‘గాంధేయం ఓ గాండీవం’ అన్న వ్యాస పరంపరలో ‘పొట్టి శ్రీరాములును తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన యోధుడుగానే గుర్తించాం కానీ తెలుగు వంటి ఇతర భాషల వారికి కూడా అటువంటి రాష్ట్రాలను ఏర్పరచిపెట్టిన, దేశ చిత్రపటాన్ని పునర్లిఖించిన భారత వీరుడు కూడా ఆయనే అని వివరించి చెప్పలేక పోయాం, పోతు న్నాం ’ అని ఆవేదన చెందారు. మాతృ భాషాపేక్షలో, నడుస్తున్న మాతృ భాషల పరిరక్షణ ఉద్యమ పోరాటాల నేపథ్యంలో, సీమాంతరాల్లో భాషలు దిష్టిబొమ్మ అవతారాలు దాలుస్తాయి.
చరిత్ర కాలగతిలో మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు చోటు చేసుకున్నాయి. ఉనికి, సాంస్కృతిక, జీవనావరణం రంగాల ప్రాతిపదికగా, అనేక ఘర్షణల తరువాత, లడాయిల తరువాత, ప్రాణత్యాగాల తరువాత ఈ క్రమాన్ని అంతా రచయిత, పార్లమెంట్ సభ్యుడూ శశి థరూర్ గారు ‘భాషా ప్రాతిపదిక అనే సిద్ధాంతం తన ఉద్దేశాన్ని అద్భుతంగా నెరవేర్చింది. ఇది వైవిధ్యభరితమైన (విభిన్న) గుర్తింపులను సులభంగా నిర్వహించగలిగే రాజకీయ విభాగాలుగా మార్చింది.
అలాగే విద్యాభ్యాసం మరియు పరిపాలనను మాతృభాషలోనే నిర్వహించేలా చూసింది’అంటూ ప్రశంసించారు.. ఆయా మాతృ భాషల పురోభివృద్ధి, వాటి గుర్తింపు, ఉనికి ప్రయోజనాల గురించి. ఇక్కడ తెలుగు నేల మీద ‘కష్టం భలే పుణ్యం కదా’ అంటూ నామిని ‘పచ్చనాకు సాక్షిగా’ -రాయలసీమ మాండలికపు తెలుగు, ‘పలుకుబడి’ అంటూ తెలిదేవార భానువర్తి తెలంగాణ యాస తెలుగు, ‘చాత్రిబాబు’గా పిలవబడీ రావిశాస్త్రి ఉత్తరాంధ్ర యాస తెలుగు, ఎన్నో సొబగులు అద్దాయి తెలుగు భాషకు. త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు తెలుగులో అజరామరం. సంజీవదేవ్ గారి తెలుగు వాక్యం ఇంగ్లిష్ లాంటి మెరుపు.
మళ్లీ శశిథరూర్ గారు ‘అర శతాబ్దం తర్వాత, కొత్త రాష్ట్రాల ఏర్పాటు వెనుక ఉన్న ప్రాతిపదిక సాంస్కృతిక అంశాల నుంచి పూర్తిగా అభివృద్ధి మరియు పరిపాలనాపరమైన అత్యవసర అవసరాలుగా మారిపోయింది’ అని చెప్పినట్లు సాంస్కృతిక రంగం మీద ఆర్థిక రంగం పైచేయిగా మారి, దానికి తోడు సాంకేతికతాభివృద్ధితో ఉపాధి మొదలగు రంగాల్లో ఇంగ్లిష్‌ను భుజాలపై మోస్తూ దించకుండా పోతున్నారు. ఎన్నో అసంబద్ధ వాదోపవాదనలు గావిస్తున్నారు.
మాతృ భాషాభిమానం గురించి కొన్ని చిన్న ఉదాహరణలు : లాంతర్ల వెలుగులోనే చదువుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు.. ఆంగ్లంలో మాట్లాడే పెద్దలకే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న దుష్ర్పచారం తగదన్నారు. అలాగే అవిశ్రాంత విశ్రాంత జీవితం గడుపుతున్న ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కోలవెన్ను విఠల్‌వర్తి గారు ‘నేను తెలుగు భాషా ప్రేముకుణ్ణి. నా భార్య తెలుగు ప్రొఫెసర్ అని కాదు.
నేను స్వయంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యున్ని. విజయవాడలో డిగ్రీ విద్యార్థిగా ఏకవీర నవలను విశ్వనాథ వారు బోధించగా విన్న అదృష్టవంతుణ్ణి. తెలుగు తప్పక ఒక సబ్జెక్టుగా తెలుగు వారందరూ చదవాలన్న కోరిక ప్రగాఢంగా గలవాడిని. పదవీ విరమణానంతరం ఓ ఇంజినీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా చేరి తెలుగు పాఠాలు బోధించాను’ అని చెప్పుకొచ్చారు.
మాతృభాష పరిరక్షణ ఓ స్వీయ ధర్మం. నదులకు పుట్టినిళ్లు ఉన్నట్లే జనజాతులకి భాషల పుట్టినిళ్లు ఉంటాయి. మాతృ భాషలు మన కిరీటాలు.. చిర్నవ్వులు భాషలో మొలకెత్తుతూ వుంటాయి. ‘విజయ కేతనాలు ఎగరాలంటే మాతృ స్తన్యాన్ని చప్పరింహాల్సిందే. తల్లి భాషలకు వందనాలు సమర్పించాల్సిందే’!. నేడు భూగోళం ఎంతగా వేడెక్కుతుందో, పర్యావరణం ఎంతగా ధ్వంసమవుతుందో ప్రతీ పౌరుడికి దినవారీ అనుభవమే. దాని దిద్దుబాటి చర్యలు చేపట్టగలగ లేని రాజకీయ చర్యలు కూడా పౌరుల అనుభవమే. ఆపై సాంసృతిక నాగరికత దిగజార్చుతున్న సంగతీ విధితమే.
జిడ్డు కృష్ణమూర్తి గారు ‘పాలిటిక్స్ అన్న వ్యాసం’లో ‘జీవితం గురించిన సమగ్రమైన సత్యాన్ని తెలుసుకోవడం కంటే, సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో తలదూర్చడం చాలా సులభం. ఏదైనా ఒక వ్యవస్థీకృత ఆలోచనతోనో, రాజకీయ లేదా మతపరమైన కార్యకలాపాలతోనో మమేకం కావడం వ్యక్తికి సులభమైన మార్గంగా అనిపిస్తుంది. రాజకీయ లేదా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది ప్రతిరోజూ మనం ఎదుర్కొనే నిస్సారమైన,
విసుగు పుట్టించే దైనందిన జీవితం నుంచి ఒక గౌరవప్రదమైన పలాయన మార్గాన్ని(తప్పించుకునే మార్గా న్ని) ఇస్తుంది. ‘జీవితం అనేది ఒక సంపూర్ణమైన ప్రక్రియ. బాహ్య ప్రపంచం, అలాగే అంతరంగం ఖచ్చితంగా ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి. కానీ, అంతిమంగా అంతరంగమే ఎల్లప్పు డూ బాహ్య పరిస్థితులను అధిగమిస్తుంది’. అని అంటారు. మాతృభాషకు ముమ్మారు వందనాలు.
వనస్థలిపురం, హైదరాబాద్-, 9849558842