18 April, 2026 | 2:31 PM

తెలుగు సాహితీ సంబురం

20-10-2025 12:00 AM

అక్టోబర్  25.. అదేమిటో మీకందరికీ తెలుసు. మొన్న హర్షణీయం అనిల్ కుమార్, ఛాయ అరుణాంక్‌తో జరిపిన ముచ్చటైన సంభాషణతో ‘ఛాయ సాహిత్యోత్సవం’ స్వరూప స్వభావాలు తెలిశాయి. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. ఛాయ మిత్రులు చేపట్టిన కార్యక్ర మం, దాన్ని నిర్వహిస్తున్నది డైరెక్టర్‌గా సంపాదకుడు కే శ్రీనివాస్, ఆయన బృందం. కాబట్టి రెండు మాటలు రాయాలనిపించిం ది. నాకూ ఆ ఉత్సాహం, సంతోషం సోకిం ది.

ఒకేరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరిగే ఒక కార్యక్రమానికి నిర్వాహకులు పడుతున్న  శ్రమ నాకు  రోజువారీన  తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని సంకల్పించి సిద్ధం చెయ్యడం సామా న్యవిషయం కాదు. కార్యక్రమం గురించి తెలియచేసిన వెంటనే ఇష్టమైన జంటపెళ్లికి పిలిచినంత సంబురం వ్యాపించింది. ఈ ఉత్సవం విజయవంతమైపోయింది.

మామూలుగా జరిగే బుక్ ఫెయిర్స్ కోసం నెల రోజుల ముందునుంచే ఎదురు చూస్తూవుంటాం తొలకరికోసం లాగా. ఈ ఉత్సవం మాట చెవినపడగానే అంతకంటే ఎక్కువ ఉత్సాహం కొత్తపుస్తకాల పరిమళంలా అంతటా వ్యాపించింది. అప్పుడే విజయవంతం అయిపోయిందని నేనడానికి ఒకే కారణం యువత. యువత కోసం అని చెప్పకపోయినా వాళ్లందరికీ ఇది వ్యక్తిగత ఆహ్వానంలా వెళ్లింది. 

యువ రచయితలకు ప్రోత్సాహం

ఛాయ ప్రచురణలతో పరిచయం ఉన్న అందరికీ యువ రచయితలకు అక్కడ దొరికే ప్రోత్సాహం తెలుసు. అమ్మకాలతో సంబం ధం లేకుండా కొత్త యువకుల పుస్తకాలు వేశారు మోహన్. మొదటిపుస్తకం ఇవ్వగల ఆత్మవిశ్వాసం, అనుభవం వల్ల మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక కొత్త రచయిత లోకంలో పడ్డాడనమాట. రేపు 25న ఉత్సవానికి వచ్చేది యువత వెల్లువ. అక్కడ ఏర్పాటు చేసిన ప్రతివేదిక ముందూ వాళ్లే నిలబడివుంటారు.

వాళ్లు ఇష్టపడ్డానికి ముఖ్యకారణం ఉంది. ఇష్టమైన రచయితలను బుక్ ఫెయిర్‌లో చూసి ఉంటారు. వాళ్ల ప్రసంగాలు వినివుంటారు. కానీ, ప్రసంగా లు సభకు చేసేవి. ఈ ఉత్సవంలో వినబోయేది సంభాషణం. రచయితల్ని మాట్లాడి స్తారు. తద్వారా రచయిత వ్యక్తిత్వం తెలుస్తుంది. హీ ఆర్ షీ కమ్స్ మ క్లోజర్ టు ది రీడర్స్. మనం మామూలుగా చూసే  పుస్తకావిష్కరణ వేదికల్లో తన పుస్తకం గురించి శ్రోతలు ఏం వినాలో మాత్రమే మామూలు  ఆవిష్కరణ సభల్లో చెప్పికూర్చుంటారు.

తప్పేమీలేదు అందులో. ఈ ఉత్సవ వేదికలో మాత్రం  మీద రచయిత సమాధా నా లు, వివరణలు ఇవ్వాల్సివుంటుంది. అదొక ముచ్చట. నిజానికి రచయితలకు ఇదొక మహదావకాశం. అయితే చక్కటి ఉపన్యాసాల్లో ఒదిగిపోయి కూర్చోవడం కుదరదు. ఆంధ్రదేశంలో అతి తక్కువ మహిళా ప్రచురణకర్తలున్నారు. చాలా సాహసంతో నిర్వ హిస్తున్నారు. ఈ ఉత్సవం వాళ్లకు ఉపకారం చేస్తుందని నమ్ముతున్నాను.

యువ రచయితలు, యువ పాఠకులు, యువమహిళా ప్రచురణకర్తలు ఇక్కడ కలవబోతున్నారు. ఇదే ఛాయాసాహిత్యోత్సవ సాఫల్యం అని నా ఉద్దేశ్యం. అనువాదకులు కూడా వస్తున్నారు. ఏ సభ ఎక్కడ జరిగినా అందర్నీ పిలవలేరు. పిలవదగ్గవారిని కూడా తరచూ వదులుకోవలసివస్తుంది. నిష్పాక్షికంగా చేసి నా అంతే. అందుచేత కొత్త అసంతృప్తి ఉం డే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రసిద్ధులైన పెద్ద రచయితల్లో. ఉత్సవానంతరం వాళ్లకు అలా అనిపించదని నా నమ్మకం. 

ఊరికే వచ్చి వెళ్లిపోకండి..

ఇలాంటి సాహిత్యోత్సవాల మీద ఎవరికీ యాజమాన్యపు హక్కులుండవు. మరొక నగరంలో ఉత్సాహవంతులు, ఛాయ వారి స్పూర్తితో ఇంతకంటే బాగా మరో ఉత్సవం జరిపే అవకాశం కూడా ఉంది.  స్థానికులైన యువకులకు అదెంత ఉపకారమో ఆలోచించండి. ఇలాంటి పండుగలు పూర్వం ఎరగని చైతన్యాన్ని కలిగిస్తాయి. బహుశా కొత్త అనువాదకులు, ప్రచురణకర్తలు, రచయితలు కనిపిస్తారు. కొత్తగా వస్తున్న సినిమాల్ని, నాటకాల్ని అధికభాగం యువకులే చూస్తున్నారు.

నిర్మాతలు, ప్రేక్షకులు వాళ్లే. మీరంతా రండి. మొదటిసారి చేస్తున్నప్పుడు ఏవో లోపాలు బయటపడతాయి. మీరు బాగుంది, అద్భుతంగా ఉంది.. అని రాయకపోయినా ఫరవాలేదు. ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియపరచకుండా వెళ్లిపోతేనే పొరపాటవుతుంది. ఈ ఉత్సవం ఒకసారి జరిగి ఆగిపోవడం లేదు. మరొక  మూడేళ్లు నిరాటంకంగా ఇదే వర్సిటీలో జరుగుతుంది. 

 తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

తెలుగు సాహితీ సంబురం

‘ది సౌత్ స్పీక్స్ : డైలాగ్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ స్టోరీ టెల్లింగ్’ పేరిట నిర్వహిస్తున్న ప్రారంభ సమావేశంలో ఫెస్టివల్ డైరెక్టర్ కె.శ్రీనివాస్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహితీ ప్రముఖులు అల్లం రాజయ్య, పెరుమాళ్ మురుగన్, వసుధేంద్ర, షీలా టోమీ పాల్గొంటారు. ‘తెలుగు సాహిత్యంలో కొత్త కాపు’ అంశంపై నిర్వహించే సెషన్‌కు నరేష్కుమార్ సూఫీ మోడరేటర్‌గా వ్యవహరిస్తున్నా రు.

సెషన్‌లో యువ రచయితలు స్ఫూర్తి కందివనం, మొహమ్మద్ గౌస్, బాలసుధాకర్ మౌళి ప్రసంగిస్తారు. ‘సామాజిక అంశాలను ప్రతిబింబించడంలో దక్షిణాది సాహిత్య పాత్ర’ గురించి ప్రముఖ రచయితలు పెరుమాళ్ మురుగన్ (తమిళ రచయిత), మధురాంతకం నరేంద్ర, వసుధేంద్ర (కన్నడ రచయిత) మాట్లాడతారు. సెషన్‌కు అనువాద రచయిత అవినేని భాస్కర్ మోడరేటర్‌గా వ్యవహరిస్తా రు.

ముగింపు సమావేశంలో ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ప్రదర్శన ఉంటుంది. సాహితీ వేడుకలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరుతున్నాం. ఉత్సవంలో పాల్గొనేందుకు www. chaaya literature festival.com అనే వెబ్‌సైట్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి యేటా అక్టోబర్ 4వ శనివారం ఫెస్టివల్ జరుగుతుంది. 

          ఛాయ రిసోర్స్ సెంటర్