కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
నవ్వుల పువ్వుల మధ్య
కబుర్ల కలబోతల నడుమ
ఆనంద డోలికల్లో ముంచి
పారవశ్యపు ఒడ్డుకు విసిరేస్తుంటాయి
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
ఒడువని ముచ్చట్లు దొర్లుతుంటాయి
ఒకటా రెండా
తొలి అనుభవపు తాపత్రయాల నుంచి
వయసుడిగి పోయే అవస్థల దాకా
అలా నాట్యమాడి పోతుంటాయి
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
రాలిపోయిన బతుకుల్ని తలచుకుని
ఇన్ని కన్నీళ్లు..
వాడకుండా నిలబెట్టుకునేందుకు
ఇన్ని సలహాల పన్నీళ్లు..
చిలకరించేసి పోతుంటాయి
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
బతుకు బాటలో
దేశాలు పట్టిపోయిన మిత్రుల్ని
ఉన్న ఊరిలోనే
పుట్టకొకరుగా చెల్లాచెదురైన సన్నిహితుల్ని
కలేసి కట్టేస్తుంటాయి..
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
బతుకు బాటలో అలసి
కోరుకున్న ఒడ్డుకు చేరిన నావలు కొన్ని
ఏ దరిచేరామో తెలియని
అయోమయాలు మరికొన్ని
ఎక్కడ ఎలా ఉన్నా..
అంతస్థులు మరచి
ఆత్మీయతలు పంచుతుంటాయి
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
అప్పుడప్పుడు
అలా బడి పిల్లలమై గతంలోకి జారినప్పుడు
మనసు లోతుల్ని తడిమినప్పుడు
స్నేహ మాధుర్యాలని చిలికినప్పుడు
ఆ సాయంకాలాలు ఎప్పటికీ
మది హృదిలో నర్తనం చేస్తుంటాయి
అందుకే..
కొన్ని సాయంకాలాలు బాగుంటాయి
వీఆర్ తూములూరి






