21-10-2025 12:00:00 AM
26న మాదిరెడ్డి సులోచన జయంతి :
తెలంగాణ ప్రాంతపు మాండలికపు పరిమళాలు, గ్రామీణ ప్రాంతాల్లో మట్టి మనుషుల వాస్తవిక జీవన చిత్రాలు, మహిళల వ్యక్తిత్వాలు, వారి అంతరంగాలను ఆవిష్కరిస్తూ, పారదర్శక శైలిని ప్రతిబింబించిన రచనలకు కేరాఫ్ మాదిరెడ్డి సులోచన. శిల్పంలో భాషాపరమైన మాధుర్యం ఆమె ప్రత్యేకత. ‘అసూయ’, ‘హక్కు’, ‘తాడికింద పాలు’, ‘అణికాడు’ రచనలు ఆమె రచనా చాతుర్యానికి మచ్చుతునకలు. ఉపాధ్యాయురాలిగా మొదలుపెట్టి ఆమె ప్రయాణం సాహిత్యరంగం వైపు మళ్లింది.
తెలుగు సాహితీ రంగంలో ఆమెది ప్రత్యేక స్థానం.ఆమె 1935 అక్టోబ ర్ 26న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జన్మించారు. ఆడపిల్లలకు చదువులెందుకనే సామాజిక వెనుకబాటు ఉన్న కాలంలో ఆమె ఇం టి వద్దనే ప్రాథమిక విద్యనభ్యసించారు. హైదరాబాద్‌లోని బేగంపే ట ఆర్యసమాజ్ గురుకులంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి కళాశాలలో బీఎస్సీ పట్టా పొందారు.
వివాహమైన తర్వాత భర్త మాదిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహం తో ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎడ్, ఎంఏ, ఎంఈడీ కోర్సులు పూర్తిచేశారు. హైదరాబా ద్ సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో రసాయనశాస్త్ర ఉపాధ్యాయురాలి గా వృత్తిజీవితం ప్రారంభించారు. టీచర్ కొలువును వృత్తిలా కాకుండా భావితరానికి విజ్ఞానాన్ని పంచే బాధ్యతగా భావించి ఆమె పదేళ్ల పాటు పాఠాలు చెప్పారు.
భర్త వృత్తిపరమైన బాధ్యతల కారణంగా వారు కొంతకాలం ఇథియోపి యా, జాంబియా దేశాల్లో ఉండాల్సి వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా తెలు గు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకుంటూనే ఉన్నారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సాహిత్యాభిమానిగా, కళాభిమానిగా ప్రస్థానాన్ని కొనసాగించారు. బహుముఖ ప్రజ్ఞశాలిగా ఖ్యాతినొందారు.
సాహిత్య రంగంలో కృషి
సులోచన రచనా ప్రయాణం 1962లో ప్రారంభమైంది.ఆమె తొలి నవల ‘జీవన యాత్ర’. సమాజ వాస్తవాలు, స్త్రీ మనస్తత్వం, మధ్యతరగతి విలువలు సహజసిద్ధంగా ఆమె రచనల్లో తొణికిసలాడేవి. ఆమె సుమారు 72 నవలలు రాశారు. ‘జననీ జన్మభూమి’, ‘వీడని నీడ’, ‘సంధ్యారాగం’ వంటి రాజకీయ నవలలు అప్పట్లో ఒక సంచలనం. ‘దేవీ చంద్రగుప్త’ వంటి చారిత్రక నవల నాటి మహిళా రచయిత్రులకు దిక్సూచి.
ఆమె రచనల్లో పది నవలలు సినిమాలుగా వెండితెరపై తళుక్కుమన్నాయి. ఆమె రచనాశైలి ఎంతో సరళంగా ఉంటుంది. పాత్రలు తెలంగాణ ఉచ్ఛారణతో సహజ సిద్ధంగా ముచ్చటిస్తాయి. అతి సాధారణ ప్రజల జీవితాల్లోని సున్నితమైన అంశాలను, గ్రామీణ జీవితా లను, స్త్రీపోరాటాలను ఆమె రచనల్లో ఆవిష్కృతమవుతాయి. మొత్తం గా మహిళల ఆత్మగౌరవం, ప్రేమ, కర్తవ్యభావం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.
స్త్రీ చైతన్యం, కుటుంబ సంబంధాల విశ్లేషణ, తెలంగాణ స్థానికత, నైతిక విలువలు ఆమె నవలల్లోని ప్రధానాంశా లు. సులోచన నవలలతో పాటు 12 నాటికలు, 67 కథలు రాశారు. వాటిలో 20 కథలను సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ కే.విద్యావతి సంపాదించి 2010లో ‘మాదిరెడ్డి సులోచన కథలు’ సంకలనం వెలువరిం చారు. కథల్లో మధ్యతరగతి స్త్రీజీవితం, మానవ సంబంధాలు, సామాజిక విరోధాలు, స్త్రీ స్వాతంత్య్ర ఆలోచనలను ప్రతిబింబించారు.
‘అసూయ’లో మానుషుల మధ్య అసూయ, రాగద్వేషాలు, ‘తాడి క్రింద పాలు’లో స్త్రీ ఆత్మగౌరవం, ‘మరపురాని క్షణాలు’లో విదేశీ స్త్రీస్థుర్యైం, ‘కోరల్ బీలో కొన్ని క్షణాలు’లో భయనక రసాన్ని ఆవిష్క రించారు. ‘ఇదీ భారతం’లో ప్రభు త్వ వ్యవస్థలపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ‘సిన్సియారిటీ ఖరీదు’లో ప్రభుత్వశాఖల్లో అవినీతిపై కటువైన విమర్శ ఉంది. ‘హక్కు’, ‘ఓ తల్లి’, ‘ఇల్లరికపు అల్లుడు’ కథ లు కుటుంబ సంబంధాలు, స్త్రీ బా ధ, త్యాగాన్ని ప్రతిబింబిస్తాయి. ‘ఆణికాడు’, ‘తప్పునాదా?’ రచనల్లో యువతరం తాలూకు మోహం, తల్లిదండ్రుల పక్షపాతాన్ని విశ్లేషించారు.
పురస్కారాలు.. కీర్తిప్రతిష్ఠలు..
బోధనారంగంలో ఆమె నిబద్ధతకు అప్పటి రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. నవల ‘తరం మారింది’ ఆధారంగా రూపొందిన చలనచిత్రం రాష్ట్రప్రభుత్వ అవార్డు సాధించింది. రచయిత్రిగా ఆమె ప్రతిష్ఠాత్మక ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు. గృహలక్ష్మి సంస్థ ‘స్వర్ణకంకణం’ అంద జేసింది. ‘భావి భారతంలో భర్త’, ‘ఎంతెంత దూరం’ ఏకాంకికలకు అనేక గౌరవ పురస్కారాలు దక్కాయి.
వంశీ ఆర్ట్స్ థియేటర్స్, అరుణి మ నృత్యకళా కేంద్రం ఆమెకు ‘సాహిత్య - కళా సింధు’ బిరుదునిచ్చాయి. ‘మాదిరెడ్డి సులోచన నవలా సాహిత్యానుశీలనం’, ‘మాదిరె డ్డి సులోచన నవలలు - ఒక పరిశీలన’, ‘చంద్రగుప్త’, ‘జననీ జన్మభూమి’ నవలలపై విశ్లేషణలు వెలువడ్డాయి. ‘తెలుగు అకాడమీ’ 2017లో ఆపై ప్రత్యేకంగా మోనోగ్రాఫ్‌ను ప్రచురించింది. ఈ గ్రంథం పరిశోధకులకు ప్రామాణిక ఆధారమై నిలిచింది.
1984లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆమె కన్నుమూశారు. ఆమె కాలం చేసి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ రచనలు నిత్యనూతనం. భావితరా లకు మార్గదర్శకాలు. ఆమె స్మారకార్థం ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ ఏటా సాహితీవేత్తలకు ‘మాదిరెడ్డి సులోచన బంగారు పతకం’ ప్రదానం చేస్తోంది.
డాక్టర్ ఐ చిదానందం, వ్యాసకర్త సెల్: 8801444335