1 July, 2026 | 1:18 AM

బజరంగ్‌కు తాత్కాలిక ఊరట

04-06-2024 03:19 AM

సస్పెన్షన్ ఉపసంహరణ

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు తాత్కాలిక ఊరట లభించింది. బజరంగ్‌పై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డిసిప్లీనరీ కమిటీ (ఏడీడీపీ) సోమవారం తెలిపింది. డోపింగ్ టెస్టు నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) బజరంగ్‌పై చర్యలు తీసుకుంటూ నోటీసులు అందించేవరకు అతడి సస్పెన్షన్‌ను ఉపసంహరించినట్లు ఏడీడీపీ పేర్కొంది.

సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా ఈ ఏడాది మార్చిలో డోపింగ్ టెస్టులో పాల్గొనేందుకు బజరంగ్ నిరాకరించినట్లు తేలడంతో నాడా ఏప్రిల్ 23న బజరంగ్‌పై నిషేధం విధించింది. ఆ వెంటనే ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా నాడా నిర్ణయాన్ని సమర్థించింది. తాను ఎప్పుడు డోపింగ్‌కు నిరాకరించలేదని.. శాంపిల్ ఇచ్చేందుకు గడువు ముగిసిన కిట్‌ను అందించారని బజరంగ్ పేర్కొన్నాడు. తాజాగా సోమవారం బజరంగ్ లాయర్లు  ఏడీడీపీ డిసిప్లీనరీ కమిటీతో సమావేశమయ్యారు. వాదనలు విన్న కమిటీ నాడా చర్యలు తీసుకునే వరకు అతడిపై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.