సింధు ఈసారైనా!
నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్
జకర్తా: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత ఏస్ షట్లర్లు మరో అంతర్జాతీయ టోర్నీకి సమాయత్తమవుతున్నారు. మంగళవారం నుంచి జకర్తా వేదికగా ఇండోనేషియా ఓపెన్ సూపర్ టోర్నీ ప్రారంభం కానుంది. మహిళల సింగిల్స్‌లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు సత్తా చాటాలని భావిస్తోంది. ఇటీవలే ముగిసిన మలేషియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడంలో విఫలమైన సింధు ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. సింధు తొలి మ్యాచ్‌లో వెన్ సూ (చైనీస్ తైపీ)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో సాత్విక్ జోడీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది ఇండోనేషియా ఓపెన్ గెలుచుకున్న సాత్విక్ జంట ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ జాలీ, అశ్విని జోడీలు ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. గాయత్రి ద్వయం తొలి రౌండ్‌లో చెంగ్ యూ సున్ యూ (చైనీస్ తైపీ) జోడీని ఎదుర్కోనుంది. ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఈ టోర్నమెంట్‌లో టాప్ షట్లర్లంతా బరిలోకి దిగనున్నారు.






