1 July, 2026 | 2:15 AM

ఆతిథ్యం అదుర్స్

03-06-2024 01:52 AM

ఆరోన్ జోన్స్ మెరుపులు

అమెరికా, వెస్టిండీస్ బోణీ

టీ20 ప్రపంచకప్

పొట్టి ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్లకు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి మ్యాచ్‌లో అమెరికా రెచ్చిపోతే.. మలి పోరులో వెస్టిండీస్ విజృంభించింది. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్‌కప్ తొమ్మిదో ఎడిషన్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్ మెగాటోర్నీలో బోణీ కొట్టాయి. ఆరోన్ జోన్స్ అల్లాడించడంతో కెనాడపై అమెరికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. సమష్టి ప్రదర్శనతో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ విజయ దుందుభి మోగించింది. 

డల్లాస్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో అమెరికా శుభారంభం చేసింది. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో కెనడాను చిత్తుచేసి మెగాటోర్నీలో తతన ఆగమనాన్ని ఘనంగా చాటింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నవ్‌నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరిశారు. శ్రేయస్ (16 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కోరె అండర్సన్ గతంలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అనంతరం లక్ష్యఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అతడికి ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 131 పరుగులు జోడించడంతో అమెరికా మరో 14 బంతులు మిగిలుండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ‘భయం లేని క్రికెట్ ఆడాలనే లక్షంతోనే బరిలోకి దిగాం. ఆటలో మేం ఏం చేయగలమో ప్రపంచానికి చాటాలనుకున్నాం. అందుకు ప్రపంచకప్‌ను మించిన వేదిక ఏముంటుంది’ అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న ఆరోన్ జోన్స్ అన్నాడు.

ప్రొవిడెన్స్: రెండుసార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీ గ్రూప్ బీలో భాగంగా ఆదివారం జరిగిన రెండో పోరులో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సీస్ బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ అసద్ (21), వికెట్ కీపర్ కిప్లిన్ (27) పర్వాలేదనిపించారు.

విండీస్ బౌలర్లలో రస్సెల్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాండన్ కింగ్ (34; 7 ఫోర్లు) రాణించారు. జట్టు నిండా హిట్టర్లే ఉన్నా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ కష్ట పడింది. ఆచితూచి ఆడిన కరీబియన్లు.. ఆఖర్లో గాని భారీ షాట్లు కొట్టలేదు. నికోలస్ పూరన్ (27; ఒక ఫోర్, 2 సిక్సర్లు), రస్సెల్ (15 నాటౌట్; ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో అసద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

కెనడా: 20 ఓవర్లలో 194/5 (నవ్‌నీత్ 61, నికోలస్ 51; హర్మీత్ 1/27), 

అమెరికా: 17.4 ఓవర్లలో 197/3 (జోన్స్ 94 నాటౌట్, ఆండ్రీస్ 65; డిలాన్ 1/19)