6 May, 2026 | 12:23 PM

క్యాబినెట్ విస్తరణ 2న!

24-06-2024 12:58 AM

డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ! 

ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం డజన్ మంది ఆశావహులు

బీసీల్లో ఇద్దరికి, రెడ్లకు రెండు, లంబాడ, మైనార్టీల్లో ఒకరికి ఛాన్స్ 

నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అవకాశం 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను భర్తీ చేసేందుకు  కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. కుదిరితే జూలై 2న  మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, లేదంటే వచ్చేనెల మొదటి వారంలో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో చోటు దక్కని ఉమ్మడి  జిల్లాలకు రెండో విడతలో అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. మొదటివిడత మంత్రివర్గంలో చోటుదక్కని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి.

ఇక ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు అవకాశం ఇచ్చారు. నల్లగొండ  నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి  శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, మెదక్ నుంచి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

రెండో విడతలో జరిగే మంత్రివర్గ  విస్తరణలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను రెండు పదవులు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి ఎస్టీ లంబాడ, మరొకటి మైనార్టీ లేదా ఎస్సీలోని మాదిగలకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరగుతోంది.  ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేల వరకు  పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారిలో ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రకటించారు.

దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య లేదంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను  పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ కోటాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు వినిపిస్తోంది.

ఇదే జిల్లాకు చెందిన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మూడు రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం.. సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

ఇక  అదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన  ఎమ్మెల్యేలు  వెడ్మ బొజ్జు, గడ్డం వివేక్‌లు కూడా మంత్రి పదవులు ఆశించినప్పటికి ప్రేమ్‌సాగర్‌రావుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలు అమాత్య పదవుల కోసం గట్టిగానే లాబీయింగ్ చేసుకుంటున్నారు. వీరిలో మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించి, రామ్మోహన్‌రెడ్డికి చీఫ్ విప్ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. లంబాడ  సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదే జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రి పదవి కావాలని గట్టిగానే డిమాండ్  చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గంలో ఉండగా, రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఎస్సీలోని మాదిగ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పిస్తే ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణలో ఒకరికి అవకాశం దక్కొచ్చనే చర్చ జరుగుతున్నది. మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్‌అలీ పేరు వినిపిస్తోంది. అయితే మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఒకరు కూడా లేకపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. 

పార్టీ అధిష్ఠానం మాత్రం ఎమ్మెల్యేల పనితీరును బట్టే పదవులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై త్రీమెన్ కమిటీ అధ్యయనం చేసి.. ఆ కమిటీ  నివేదిక ప్రకారం ఆశావాహుల భవిష్యత్ తేల్చబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు తాజాగా కాంగ్రెస్‌లోకి మొదలైన చేరికల పర్వంతో సొంత పార్టీలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది. బీఆర్‌ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భవిష్యత్‌లోనూ మరికొందరు హస్తం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారని చెబుతున్నారు.  దీంతో మంత్రివర్గంలో వలస నేతల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు.. 

నిజామాబాద్ - సుదర్శన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, షబ్బీర్‌అలీ 

అదిలాబాద్ - ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు, గడ్డం వివేక్

రంగారెడ్డి - మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి

హైదరాబాద్ - దానం నాగేందర్, బల్మూరి వెంకట్

నల్లగొండ - బాలునాయక్, బీర్ల అయిలయ్య, కే రాజగోపాల్‌రెడ్డి

కరీంనగర్ - అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ

మహబూబ్‌నగర్ - వాకిటి శ్రీహరి 

నేడు ఢిల్లీకి సీఎం

  1. రెండు రోజులు హస్తినలోనే 
  2. ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు 
  3. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవి.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఢిల్లీ పెద్దలతో చర్చ 
  4. రాష్ట్ర సమస్యలు, అదనపు నిధులపై కేంద్ర మంత్రులతోనూ సమావేశం 

హైదరాబాద్, జూన్ 23 ( విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులు అక్కడనే ఉండి ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరై.. ఆ తర్వాత పార్టీ పెద్దలతో పాటు రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం.. వారితో ప్రత్యేకంగా సీఎం సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించే వ్యూహంతో పాటు రాష్ట్ర సమస్యలు, విభజన అంశాలపైన సభ దృష్టికి తీసుకొచ్చే వాటిపైన ఎంపీలకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు నామినేటెడ్  పదవుల భర్తీ అంశంపై పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.

జూలై 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. మంత్రి పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నారు. దీంతో మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశ ఉం దని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మందికి  కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. ఎన్నికల కోడ్ రావడంతో.. వారి ప్రమాణస్వీకారం వాయిదాపడింది. అయితే నామినేటెడ్ పదవులు దక్కిన వారిలో కొంద రు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయలేదని, దీంతో పార్టీకి నష్టం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఐదారుగురికి పార్టీతో ఎలాంటి  సంబంధం లేకున్నా నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఏఐసీసీ నేతలకు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ముందుగా ప్రకటించిన 37 నామినేటెడ్ పదవుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని కూడా చెబుతున్నారు. వీటితో పాటు మరో 17 మందికి కొత్తగా నామినేటెడ్ పదవులు కూడా ప్రకటిస్తారని, ఆ పదవుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.  ఇక, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన సమస్యలతోపాటు రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇవ్వనున్నారు.