3 July, 2026 | 1:15 PM

ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

03-07-2026 12:43 PM

.... కలెక్టర్ కె.హరిత 

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండల కేంద్రంలో ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సేకరించి, వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి ఫారాలను పూర్తిగా నింపించుకోవాలని, నింపిన ఫారాలను వెంటనే సేకరించి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) డిజిటలైజేషన్‌కు పంపించాలని చెప్పారు.

ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. యువజన సంఘాలు, చదువుకున్న యువత, గ్రామస్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఫారం నింపే ప్రక్రియపై గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. గడువు తక్కువగా ఉన్నందున అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను BLOలకు తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీపీఎం , ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, బీఎల్వోలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.