28-05-2025 01:54:57 AM
పీవోకేను అనాడే స్వాధీనం చేసుకోవాలని పటేల్ కోరుకున్నారు..
ఆయన మాట విననందునే ఇప్పటికీ ఉగ్రదాడులు
గుజరాత్ పర్యటనలో పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ధ్వజం
గాంధీనగర్, మే 27: ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒక యుద్ధవ్యూహంగా అనుసరిస్తోందని, దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. పాక్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరై ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారని, ఆ దేశ ఆర్మీ సైతం వారికి సెల్యూట్ చేసిందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని, పాకిస్థాన్ యుద్ధవ్యూహమని ఇది రుజువు చేస్తోందని వెల్లడించారు.
రెండు రోజల పర్యటనలో భాగంగా గుజరాత్‌కు వెళ్లిన ప్రధాని మోదీ మంగళవారం గాంధీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1947లో దేశం మూడు ముక్కలుగా చీలిపోయిందని, ఉగ్రవాదుల సహాయంతో పాక్ భారతదేశంలోని ఒక భాగాన్ని స్వాధీనం చేసుకుందన్నారు.
దేశ తొలి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సైన్యం తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుకున్నారని అన్నారు. ‘ముజాహిదీన్ల పేరుతో ఉగ్రవాదుల సహాయంతో పాకిస్థాన్ భారత్‌లోని ఒక భాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆరోజున ముజాహిదీన్లను చంపి పటేల్ సలహాను అంగీకరించి ఉంటే 75 సంవత్సరాలుగా భారత్‌లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదు..’ అని చెప్పారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ భారత్‌లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే మౌనంగా చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోదని, తాము శాంతంగా ఉండటంతో పాటు ఇతరులు అలాగే ఉండాలని కోరుకుంటామన్నారు. పరోక్ష యుద్ధంతో భారత్ బలాన్ని పరీక్షించాలని చూస్తే సహించేది లేదని చెప్పారు. భారత్, పాక్ మధ్య సింధుజలాల ఒప్పందంపై జరిగిన చర్చలు కూడా సమంజసంగా లేవన్నారు.
కశ్మీర్‌లోఆనకట్టల పూడిక తీయడానికి కూడా అనుమతించని నిబంధనలు అందులో ఉన్నాయన్నారు. 1960 సింధు జలాల ఒప్పందాన్ని అధ్యయనం చేస్తే ప్ర జలు షాకవుతారని, జమ్మూ కశ్మీర్ నదులపై నిర్మించిన ఆనకట్టలను శుభ్రం చేయకూడదని నిర్ణయించారన్నారు. పూడిక తీయకూడదని, అవక్షేపాలను తొలగించడానికి దిగువ ద్వారాలను మూసివేయాలన్నారు. 60 సంవత్సరాలుగా ఈ ద్వారాలను ఎన్నడూ తెరువలేదని ప్రధాని మోదీ వివరించారు.