15 May, 2026 | 8:50 PM

చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం

15-05-2026 07:54 PM

* జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట: జిల్లాలోని ఆదివాసి గిరిజన, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్‌క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (టీజీఐఎల్పీ)ను సమర్థవంతంగా అమలు చేసి చెంచు గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ పెంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, అత్యంత పేదరిక పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు గుర్తించిన 34 చెంచు కుటుంబాలతో సమావేశమై వారి సమస్యలనుకలెక్టర్ తెలుసుకున్నారు.

చెంచు కుటుంబాల జీవన విధానం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య పరిస్థితులు, పిల్లల విద్య, తాగునీటి సౌకర్యాలు వంటి అంశాలపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న చెంచు కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీజీఐఎల్పీ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించి, వారిని స్వయం ఆదాయం పొందే స్థాయికి చేర్చాలని అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రతి కుటుంబానికి వారి సామర్థ్యాలు, ఆసక్తులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక జీవనోపాధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పశుపోషణ, కోళ్ల పెంపకం, చిన్నచిన్న వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇచ్చి ఆదాయ వనరులు పెంచాలని అధికారులకు ఆదేశించారు. చెంచు మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, తను మళ్లీ 20న వస్తానని ఆ లోగా వారికి అనువైన స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కోరారు.

మహిళా సంఘాల ద్వారా పొదుపు అలవాట్లు పెంపొందించి, బ్యాంకు లింకేజీలు కల్పించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించాలని, గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మల్లాపూర్ పెంటలో మౌలిక వసతుల కొరతపై గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తాగునీరు, విద్యుత్, రహదారులు, ఆరోగ్య సేవలు, విద్యా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు చదువుకు దూరం కాకుండా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని,

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన చెంచు కుటుంబాలకు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, పింఛన్లు, రేషన్, ఆరోగ్య భద్రత పథకాలు, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రయోజనాలు అందకుండా ఎవరూ మిగలకూడదని  స్పష్టం చేశారు. చెంచు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, గ్రామ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం సాయం అందించడం మాత్రమే కాకుండా, ప్రతి కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపగలిగే స్థాయికి తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి చిన్న ఓబులేష్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి  గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.