మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): మోడీ సారధ్యంలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, రెండు నాలుకల సర్కార్, ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికలు ముగిశాక మరోలా వ్యవహరిస్తున్నారు అని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేశారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి అతని అవకాశ వాద రాజకీయాలను మరోసారి బహిర్గతం చేశారు.
పెట్రోల్, డీజిల్ ఆరు నెలల స్టాక్ ఉందని గొప్పలకు పోయి ఇప్పుడు మళ్లీ యుద్ధమే కారణమని చెప్పడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి ,బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు ఎలా పెంచారో, ఎందుకు పెంచారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రజలపై భారం పడదని గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, సీతక్క ప్రగల్భాలు పలికారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా ట్యాక్స్ లను భరించి పెరిగిన ధరలను ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పర్యటన లో పెట్రోల్ ,డీజిల్ తక్కువ వాడండి బంగారం కొనవద్దు, నూనె తక్కువ వాడాలని మోదీ చెప్పినప్పుడే ప్రజలకు అనుమానం కలిగిందని. అధికారంలో ఉండి అడ్డగోలుగా ధరలు పెంచుతూ దేశ ప్రజల నడ్డి విరుస్తున్న ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై ప్రజలు మండిపడుతున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.






