సర్పంచ్ టు సీఎం
మోహన్ చరణ్ మాఝీ
ఒడిశా సీఎంగా ప్రకటించిన బీజేపీ.. బలమైన గిరిజన నేతగా గుర్తింపు
డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ దేవ్, ప్రవటి పరీద
ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం
కార్యక్రమానికి ప్రధాని మోదీ
భువనేశ్వర్, జూన్ 11: రెండున్నర దశాబ్దాల తర్వాత ఒడిశా ప్రజలు కొత్త సీఎంను చూస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న నవీన్ పట్నాయక్ పార్టీ అయిన బీజేడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడటం.. బీజేపీకి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఒడిశా కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత, బలమైన గిరిజన నేత అయిన మోహన్ చరణ్ మాఝీని బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
దీంతో ఒడిశా 15వ సీఎం, బీజేపీకి చెందిన తొలి సీఎంగా రికార్డులకెక్కనున్నారు. కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవటి పరీదను డిప్యూటీ సీఎం పదవి వరించింది. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం తరఫున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ చరణ్ మాఝీని సీఎంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. భువనేశ్వర్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు నూతన సీఎంగా మోహన్ చరణ్ మాఘీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని సమాచారం.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..
1972 జనవరి 6వ తేదీన కియోంజర్‌లోని రైకాల అనే కుగ్రామంలో జన్మించిన మోహన్ చరణ్.. ధేనకనాల్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన.. 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేడీ నేత మీనా మాఝీ, కాంగ్రెస్ నేత ప్రతీవ మంజరీ నాయక్‌లను ఓడించారు.
కొత్త సీఎంకు అధికార నివాసం కరువు
కొత్త సీఎం అధికార భవనం కోసం అన్వేషించాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్ పట్నాయక్ తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు కొనసాగించడంతో ఈ సమస్య తలెత్తింది. 2000 నుంచి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని సొంత నివాసాన్ని సీఎం క్యాంపు ఆఫీసుగా మార్చుకుని అక్కడి నుంచే పాలన కొనసాగించారు. మొన్నటివరకు అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. కాగా, కొత్త సీఎం తాత్కాలిక నివాసంగా స్టేట్ గెస్ట్ హౌస్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
వ్యక్తిగత వివరాలు
పుట్టిన తేదీ: 6 జనవరి 1972
జన్మ స్థలం: కియోంజర్ జిల్లా
ఝూంపురా, రైకాల గ్రామం
విద్యార్హత: ధేనకనాల్ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా
రాజకీయ ప్రస్థానం: 1997 నుంచి 200౦ వరకు సర్పంచ్‌గా సేవలు.
2000 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు.
2009, 2019, 2024 ఎన్నికల్లో విజయం. కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం
భార్య : డాక్టర్ ప్రియాంక మరండీ
పిల్లలు : ముగ్గురు






