16 May, 2026 | 5:26 AM

జాతీయ అవార్డు కోసం ఆశ పడుతున్నది అందుకే..

17-02-2025 12:45 AM

సాయిపల్లవి కథానాయకిగా నటించిన ‘తండేల్’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏ సినిమా అయినా, పాత్ర ఏదైనా తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందీ భామ. నటనా రంగంలో ఉన్నవాళ్లకు అభిమాన ధనంతోపాటే అవార్డులూ ముఖ్యం. అయితే సాయిపల్లవి విషయానికొస్తే.. ‘గార్గి’ చిత్రానికి గాను ఆమెకు జాతీయ అవార్డు వరిస్తుందని ఆశపడ్డ అభిమానులు భంగపాటుకు గురయ్యారు. ఆ ఏడాది నేషనల్ అవార్డు నిత్యామీనన్‌ను వరించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి జాతీయ అవార్డు కోసం తాను ఎంతగా ఎదురుచూస్తుందో చెప్పుకొచ్చింది.

అందుకు ఒక బలమైన కారణం ఉందని కూడా తెలిపింది. ‘జాతీయ అవార్డు అందుకోవాలని నేనెంతో ఆశ పడుతున్నా. ఎందుకంటే, నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి వచ్చా. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలోనే నాకొక నమ్మకం ఏర్పడింది. అదేంటంటే.. ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని! ఎందుకంటే ఆ రోజుల్లో జాతీయ అవార్డు అంటే ఎంతో గొప్ప. కాబట్టి, మామ్మ చీర కట్టుకొనే అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. అవార్డు అందుకున్నా, లేకపోయినా.. ఆ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి మాత్రం అలాగే ఉంటుంది” అని తెలిపింది.