16 May, 2026 | 6:22 AM

రూ.100 కోట్ల క్లబ్‌లోకి తొలిసారి నాగచైతన్య

17-02-2025 12:40 AM

అక్కినేని యువ హీరో నాగచైతన్య తన కెరీర్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. తద్వారా నాగచైతన్య కెరీర్‌లోనే రూ.వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన మొదటి చిత్రంగా తండేల్ రికార్డుల్లోకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం వహించి, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు ఓ మైలురాయిగా చెప్పవచ్చు. ఫిబ్రవరిలో ఆఫ్-సీజన్ విడుదలై, ఆదివారాలు తప్ప, పెద్ద సెలవులు లేనప్పటికీ, ఈ చిత్రం ఫుట్ ఫాల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం హెచ్‌డీ వెర్షన్ విడుదలైన మొదటి రోజే లీక్ అయినప్పుడు పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలను కూడా దాటుకొని రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. రెండో వారం ముగియకముందే, ఓవర్సిసిస్ ఎర్నింగ్‌లో 1 మిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరుందని నిర్మాత బన్నీవాసు ముందే నమ్మకంగా చెప్పారు. చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మొదటి నుంచి ‘తండేల్’ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్తూ వచ్చినట్టే.. గీతా ఆర్ట్స్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం.