10 May, 2026 | 2:37 AM

24 గంటల్లోనే నిందితుల అరెస్టు

23-06-2024 12:05 AM
  • మేడ్చల్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు
  • ఇద్దరు అరెస్టు.. పరారీలో మరొకరు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): మేడ్చల్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం సంఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ మేరకు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి శనివారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న మేడ్చల్‌లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బురఖా వేసుకుని ఒకరు, హెల్మెట్ ధరించి మరో దుండగుడు ప్రవేశించారు.

దుకాణంలోని నగలు, నగదు చోరీ చేసే ప్రయత్నం చేశారు. యజమాని అప్రమత్తత వలన కేవలం 40 సెకన్లలోనే దోపిడీదారులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో 200 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నజీమ్ అజీజ్ కొటడియా (36), షేక్ సోహెల్ (23) అనే ఇద్దరిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక బైక్, 2 సెల్‌ఫోన్లు, 1 బురఖా, హ్యాండ్ గ్లౌజ్, బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

విదేశాల్లో ఉద్యోగం.. 

ప్రధాన నిందితుడు  నజీమ్ అజీజ్ కొటడియా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాడు కాగా, ఉద్యోగ నిమిత్తం ఆఫ్రికా, చైనా, అమెరికా దేశాలకు వెళ్లి తిరిగొచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ పలు చిరు వ్యాపారాలు చేస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాల బాట పట్టాడు. చాదర్‌ఘట్‌లో జరిగిన చోరీ కేసులో జైలుకి వెళ్లిన అజీజ్‌కు సోహెల్ పరిచయమయ్యాడు. వీరిద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత ఎలా చోరీలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి చోరీకి అనువైన జ్యువెలరీ షాప్‌లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరికి సహకరించిన సల్మాన్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇటీవల చాదర్‌ఘట్‌లో జరిగిన చోరీ చేసులో కూడా వీళ్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.