అభివృద్ధి పేరుతో సమాధులు తొలగించవద్దు
అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు
దళితులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు
గోపాల్ పూర్ ఉర చెరువు దళిత బాధితుల ఆవేదన
హనుమకొండ, జూన్ 8 (విజయక్రాంతి): అభివృద్ధి పేరుతో తమ తాతల,తండ్రుల సమాధులను తొలగిస్తే ఊరుకునేది లేదు అని గోపాలపురం ఊర చెరువు దళిత బాధితులు హెచ్చరించారు.
సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాలపురం ఊర చెరువు దళిత బాధితులు మాట్లాడుతు తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో తమ తాతల, తండ్రుల సమాధులను తొలగిస్తే తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్లేనని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బంధువులు తమపై పగబట్టి దళితులైన తమ బంధువుల సమాధులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే కె యు.పోలీసులు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తూ తమను అరెస్టు చేశారని,తమలో చాలామందికి గాయాలయ్యాయని అన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ కు తమ పూర్వికుల సమాధులు తొలగించకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గోపాల పురం కాలనీ వాసులు, కాంతయ్య నగర్ కాలనీ దళితులు, శ్రీనివాస్,రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






