జాంబవ వారసులే బహుజనులు
నేడు జాంబవంతుని జయంతి :
సమాజ భవిష్యత్తు నిర్మాణంలో తమ చారిత్రక వారసత్వ చరిత్ర కీలక పాత్ర పోషిస్తుంది. చరిత్రను కోల్పోయిన సమాజం ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును కోల్పోతుంది. అందుకే ప్రతి విముక్తి ఉద్యమం చరిత్రతో ప్రారంభమవుతుంది. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం ఉద్యమాలు ఇందుకు నిదర్శనం. అయితే విశ్వమానవ లోకానికే మహా ప్రభు అయిన ఆది జాంబవంతుని చరిత్ర విశిష్టమైనది. అతని పుట్టుక ప్రపంచ జనాభా దినోత్సవంతో ముడిపడింది.
ఎందుకంటే ఆయన సమాజానికి మొట్టమొదట విలువలు నేర్పి, సంఘాన్ని కట్టి, నాగరికతను నేర్పిన ఆది పురుషుడు. కావున జాంబవంతుని జయంతి ప్రపంచ జనాభా దినోత్సవం రోజైన జూలై 11న జరుపుకోవాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఈ జయంతిని నిర్వహించడం అంటే మానవ సమానత్వం, మూలవాసుల చరిత్ర, ఆత్మగౌరవం చాటుకోవడమే. డక్కలి మౌఖిక సాహిత్యం, జాంబవ ఇతిహాసం,‘మాదిగ జాగృతి సంఘం‘ అధ్యయనాల ప్రకారం జాంబవంతుడు జంబుద్వీపానికి ఆదిపురుషుడు, మహారాజు.
ఆయన వారసులే నేటి శూద్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మూలవాసులు. కానీ, మాదిగలు మాత్రమే జాంబవంతుని చరిత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు విడిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాన్ని కలపడం చారిత్రక అవసరం. ఆది జాంబవ చక్రవర్తి పాలన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మానవీయ విలువలకు ప్రతీక. అలాంటి రాజు వారసులైన మాదిగలు అగ్రవర్ణ ఆధర్మ యుద్ధంలో ఓడిపోయి తమ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఉనికిని కోల్పోయారు.
విద్య, భూమి, అధికారం వంటి సమస్త అవకాశాలకు దూరమయ్యారు. నేడు గ్రామాల్లో ఊరవతల ఉండే మాదిగవాడలను పరిశీలిస్తే.. వ్యవస్థాగతంగా మాదిగ జాతిపై జరిగిన కుట్రను గుర్తుచేస్తాయి. తెలంగాణలో మాదిగలు జనాభాపరంగా మొదటి స్థానంలో ఉన్నారు. కానీ, అనేక రంగాల్లో భాగస్వామ్యం వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ మాదిగ కుటుంబాలు అనేక రూపాల్లో వివక్షను అనుభవిస్తున్నాయి.
ఈ క్రమంలో భూ మండలంలోనే అదిపెద్దదైన జంబూద్వీప భూ భాగాన్ని పాలించిన మాదిగ బిడ్డ జాంబవంతుని చరిత్రను తెలంగాణలో ‘దళిత శక్తి ప్రోగ్రామ్‘ ద్వారా డాక్టర్ విశారదన్ మహారాజ్ పునర్జీవింపజేశారు. మాదిగల పేర్ల చివర మహారాజ్‌గా నామకరణం చేసి, మాదిగవాడలకు మహారాజుల కాలనీలని పేరు పెట్టి ‘నామ, రూప, గుణాల’తో మాదిగల్లో మానసిక విప్లవానికి నాంది పలికారు. వారసత్వ చరిత్రను తెలుసుకున్న సమాజమే భవిష్యత్తును నిర్మించగలదు.
ఈ క్రమంలో మాదిగలు తమ చారిత్రక వీరగాథను తెలుసుకొని ఆత్మగౌరవ పోరాటాలకు పిలుపునివ్వడం అత్యావశకం. చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని మాత్రమే తెలుసుకోవడం కాదు, వర్తమానాన్ని మార్చే శక్తి కూడా. కావున మాదిగలు, సహా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆది జాంబవ చక్రవర్తి విలువలతో భారత రాజ్యాంగ సమానత్వ పోరాటానికి పిలుపునివ్వాలి. మళ్లీ రాజులుగా, పాలకులుగా మారాలి.
సంపతి రమేష్ మహారాజ్
వ్యాసకర్త సెల్: 7989579428






